ఇంతకీ విషయం ఏమిటంటే.. సౌత్ కొరియన్ ఆస్కార్ అవార్డెడ్ మూవీ పారసైట్ చూస్తూ ఉంటే తనకు నిద్ర వచ్చిందని ఎస్ఎస్ రాజమౌళి చెప్పుకొచ్చారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యానాలు చేసినట్టుగా తెలుస్తోంది.
పారసైట్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. తొలి సారి ఇంగ్లిషేతర సినిమాకు ఆస్కార్ బెస్ట్ పిక్చర్ అవార్డును కూడా ఇచ్చారు. అమెరికన్లు ఈ సినిమాను అలా కళ్లకు అద్దుకున్నారు. ఆ తర్వాత ప్రపంచం దృష్టి పారసైట్ మీద పడింది. అనేక మంది ఈ సినిమాను కీర్తిస్తున్నారు. ఇక సహజంగానే కొందరు విమర్శిస్తూ ఉన్నారు! విమర్శలకు బహుశా ప్రపంచంలో ఏ సినిమా కూడా అతీతం కాదేమో!
ఆ సంగతలా ఉంటే..పారసైట్ సినిమా చూస్తూ చూస్తూ తను నిద్రపోయినట్టుగా రాజమౌళి చెప్పుకొచ్చారు. ఆ సినిమా పూర్తిగా చూడలేదని చెప్పారు. ఆ సినిమా పూర్తిగా చూడకపోవడం పాపం ఏమీ కాదు కానీ, ఆ సినిమా చూస్తుంటే తనకు నిద్రపట్టేసిందని ఈ దర్శకుడు ఇన్ డైరెక్టుగా చెప్పినట్టుగా ఉన్నారు. ఏ సినిమా అయినా అందరికీ నచ్చాలని లేదు, బాహుబలి సీరిస్ సినిమాలను చీల్చిచెండాడిన వారు లేరా! వాటిని చూస్తూ అలా నిద్రపోయిన వాళ్లు ఉండరా!