RRR దర్శక హీరోలు వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం.. దుబాయ్ తో పాటు దేశంలోని పలు నగరాల్లో పర్యటిస్తూ సినిమాని ప్రమోట్ చేశారు. అయితే సినిమా కథా రచయిత అయిన కేవీ విజయేంద్ర ప్రసాద్ ప్రచార కార్యక్రమాల్లో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా విజయేంద్రప్రసాద్ తాను కథలు అందించిన సినిమాల ప్రమోషన్లలో కాస్త ఎక్కువగానే కనిపిస్తుంటారు. కానీ స్వయానా రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్.. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా ప్రమోషన్లతో పాటు ఇతర ఈవెంట్స్ లో కనిపించకపోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.
దీనికి తోడు రాజమౌళి ఎక్కడా కూడా RRR కథ రాసిన తన తండ్రి పేరు ప్రస్తావించలేదు. ఇంటర్వ్యూలలో – ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో నటీనటులు సాంకేతిక నిపుణుల గురించి పేరు పేరునా చెప్పిన జక్కన్న.. రచయితను ఎందుకు ప్రస్తావించలేదనేది పలు ఊహాగానాలు పుట్టుకొచేలా చేసింది. విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన కథతో దర్శకుడు సంతృప్తి చెందలేదా? అనే ప్రశ్నలు కూడా వచ్చాయి.
ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్లలో విజయేంద్రప్రసాద్ లేకపోవడంతో అభిమానులు కూడా బాగా ఫీల్ అయ్యారు. వయసు సంబంధిత సమస్యల కారణంగా కోవిడ్ పాండమిక్ సమయంలో రిస్క్ చేయడం ఎందుకని బాహుబలి రచయిత ఈ ప్రమోషన్లకు దూరంగా వుంటున్నారనే వార్తలు వచ్చాయి. అలానే రాజమౌళి తదుపరి సినిమా కోసం స్క్రిప్ట్ రాసే పనిలో బిజీగా ఉన్నారని కూడా అన్నారు.
ఇలా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ తాజాగా పలు న్యూస్ చానల్స్ లో ప్రత్యక్ష మయ్యారు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా విశేషాలతో పాటుగా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చెబుతూ వస్తున్నారు.
విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు – కొమురం భీమ్ వంటి ఇద్దరు విప్లవ వీరుల నిజ జీవిత పాత్రల స్పూర్తితో ‘ఆర్.ఆర్.ఆర్’ అనే ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాకి కథ అందించారు విజయేంద్ర ప్రసాద్. గతంలో తనయుడు రాజమౌళి సినిమాల విజయాలలో భాగం పంచుకున్న సీనియర్ రైటర్.. ఇప్పుడు RRR తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.