దాదాపు మూడున్నరేళ్లుగా యావత్ భారతీయ సినీ లోకంతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేర్లలోకి వచ్చేసింది. అత్యంత భారీ స్థాయిలో అత్యధిక స్క్రీన్ లలో విడుదలైన ఈ మూవీ రిలీజ్ కి ముందే యుఎస్ ప్రీమియర్ షోలతో రికార్డుల మోత మోగించడం మొదలు పెట్టింది. రిలీజ్ రోజు ప్రారంభ వసూళ్ల పరంగానూ ఈ మూవీ ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లికించిందని ఇప్పటికే ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
సినిమా చూసిన వారంతా ట్రిపుల్ ఆర్ పై దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమిళ దర్శకుడు శంకర్ నుంచయి బాలీవుడ్ సినీ వర్గాల వరకు అంతా ముక్త కంఠంతో రాజమౌళిపై ట్రిపుల్ ఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ట్రిపుల్ ఆర్ టీమ్ మూడున్నరేళ్లు పడిన కష్టాన్నిమర్చిపోయి ఆనందంతో సెలబ్రేషన్స్ మూడ్ లోకి వెళ్లిపోతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత జక్కన్న రాజమౌళి ప్లాన్ ఏంటీ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దాదాపు మూడున్నరేళ్లుగా రాజమౌళి అతని ఫ్యామిలీ అంతా ఈ సినిమా కోసం రాత్రిబవళ్లు కష్టపడ్డారు. విజయేంద్ర ప్రసాద్ కీరవాణి రామా రాజమౌళి కార్తికేయ కాలభైరవ కీరవాణి వైఫ్ వల్లి తదితరులు వివిధ విభాగాల్లో ఈ మూవీ కోసం పని చేశారు. విశ్రాంతి లేకుండా పని చేసిన వీరంతా ట్రిపుల్ ఆర్ రిలీజ్ కావడంతో రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఇదిలా వుంటే ప్రతీ సినిమా రిలీజ్ తరువాత విశ్రాంతి కోసం ఇతర దేశాలకు వెళ్లి సినిమా వాతావరణానికి దూరంగా గడిపేస్తుంటారు రాజమౌళి.
ట్రిపుల్ ఆర్ రిలీజ్ కావడంతో రాజమౌళి 15 రోజుల పాటు విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లబోతున్నారని తెలిసింది. కుటుంబంతో సహా రాజమౌళి ఏప్రిల్ లో విదేశాలకు వెళ్లబోతున్నారట. విహార యాత్రని 15 రోజుల పాటు ప్లాన్ చేసిన జక్కన్న తిరిగి వచ్చాక మహేష్ ప్రాజెక్ట్ చర్చల్లో పాల్గొంటారని తెలిసింది. మహేష్ సినిమాకు సంబంధించిన లైన్ ఇప్పటికే ఫైనల్ అయిందని క్లారిటీ ఇచ్చేసిన రాజమౌళి ఇది మల్టీస్టారర్ మూవీ కాదని కూడా స్పష్టం చేశారు. అంతే కాకుండా ఈ మూవీని ఈ ఏడాది దసరా నుంచి పట్టాలెక్కించబోతున్నరట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు రాజమౌళి విహార యాత్ర ముగించుకుని ఇండియా తిరిగి వచ్చాక మొదలవుతాయని తెలుస్తోంది.