ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఇక్కడ ఇంతే .. కోలీవుడ్ కి స్టార్ డాటర్స్!

సీనియర్ స్టార్ హీరోల వారసులు హీరోలు అవుతుంటే వాళ్ల కూతుళ్లు హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒకప్పుడు తమ హీరో కూతుళ్లు హీరోయిన్ గా రావడానికి ఫ్యాన్స్ ఒప్పుకునేవారు కాదు. దాంతో హీరోయిన్ గా చేయాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ కెమెరా ముందుకు రాకుండా ఉండిపోయినవారు చాలామందినే ఉన్నారు.

ఇక ఎలాగైనా సినిమాకి దగ్గరగా ఉండాలనే ఉద్దేశం ఉన్న కొందరు డైరెక్షన్ డిపార్టుమెంటులో జాయిన్ అయితే మరికొందరు ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూ ఉండిపోయారు.

ట్రెండు మారిపోయింది .. అభిమానులు కూడా తమ హీరో ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. తమ హీరో ఫ్యామిలీ నుంచి వారసుడు వస్తే ఆహ్వానం పలుకుతున్నారు .. హీరోయిన్ వస్తే ఆదరిస్తున్నారు.

ఈ కారణంగానే కోలీవుడ్ లో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ .. అర్జున్ కూతురు సౌందర్య .. తెరపైకి వచ్చారు. అలాగే టాలీవుడ్ లో రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు శివాని – శివాత్మిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. వీరి ఎంట్రీ పట్ల అభిమానులు ఎవరూ కూడా అభ్యంతర పెట్టలేదు. శివాని ఇంతవరకూ చేసిన సినిమాలు ఓటీటీలోనే వచ్చాయి. అక్కడ కూడా వాటికి లభించిన ఆదరణ అంతంత మాత్రమే.

ఇక శివాత్మిక విషయానికి వస్తే ఆమె చేసిన ‘దొరసాని’ సినిమా అంతగా ఆడలేదు. అయితే తెలంగాణ ప్రాంతంలోని గడీల పెత్తనం .. అప్పటి ప్రేమ కథలకు ముగింపు ఎలా ఉండేదనేది ఈ సినిమా చెబుతుంది. ఇది మొదటి సినిమానే అయినా శివాత్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.

తాము ఒక స్టార్ హీరో కూతుళ్లమనే విషయాన్ని పక్కన పెట్టేసి తమకి నచ్చిన కథలను .. పాత్రలను చేయడానికి ఇద్దరూ కూడా ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. తెలుగు నుంచి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తమిళ సినిమాల పట్ల ఉత్సాహాన్ని చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో తమిళంలో శివాని ‘అన్బరివు’ అనే ఒక సినిమా చేసింది. సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ ఈ సినిమాలో హీరో. జీవీ ప్రకాశ్ కుమార్ మాదిరిగా తమిళంలో హీరోగా ఆయన బాగానే కుదురుకున్నాడు. ఆయన ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో శివాని మోడ్రన్ గాళ్ గా చాలా సెక్సీగా కనిపించనుంది. జనవరి 7వ తేదీ నుంచి ‘హాట్ స్టార్’ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఇక శివాత్మిక కూడా ‘ఆనందం విలయాడుం వీడు’ అనే సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించనుంది. ‘అభినందన’ హీరో కార్తీక్ తనయుడు గౌతమ్ ఈ సినిమాలో హీరో. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే పక్కా మాస్ ఎంటర్టైనర్. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. తెలుగులో తమ కెరియర్ పట్ల కాస్త అసంతృప్తిగా ఉన్న ఈ అక్కా చెల్లెళ్లిద్దరికీ కోలీవుడ్ హిట్లు కట్టబెడుతుందేమో చూడాలి మరి.

Exit mobile version