ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఇదెక్కడి చోద్యం: రజనీకాంత్‌ రాజకీయంపై ‘మెగా’ ఎఫెక్ట్‌.!

ప్రపంచంలో ఎక్కడో ఏదో మూల జరిగిన ఓ సంఘటన, ఇంకెక్కడో ఇంకేదో ఘటనకు కారణమవుతుందట. దీన్ని బటర్‌ ఫ్లై ఎఫెక్ట్‌ అంటారట.! ఇదెక్కడో సినిమాలో విన్న డైలాగ్‌లా వుంది కదూ.! సరే, ఆ సంగతి పక్కన పెట్టి, అసలు విషయానికొచ్చేద్దాం. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో ఆయన వెనక్కి తగ్గారు.

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాక, ఆయనకు జ్ఞానోదయం అయ్యిందట రాజకీయ పార్టీ పెట్టకూడదని. దీనంతటికీ కారణం మెగాస్టార్‌ చిరంజీవి అట. చిరంజీవి బ్రెయిన్‌ వాష్‌ చేయబట్టే రజనీకాంత్‌, రాజకీయ పార్టీ పెట్టకూడదని కీలక నిర్ణయం తీసేసుకున్నారట. ఇదీ, కొందరు అవివేకుల విశ్లేషణ. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది కదూ.. ఈ వ్యవహారం.

చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ పెట్టి.. రాజకీయంగా సాధించింది ఏమీ లేదు కాబట్టి, తాను రాజకీయాల్లో పడ్డ వేదనను రజనీకాంత్‌కి సవివరంగా తెలియజేసి.. ఇంకో యాంగిల్‌లో చెప్పాలంటే, భయపెట్టేసి.. రజనీకాంత్‌ రాజకీయ పార్టీ పెట్టకుండా చిరంజీవి బ్రెయిన్‌ వాష్‌ చేశారన్నది సదరు విశ్లేషణ తాలూకు అర్థం. హ హ హ.! అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో ఏమో.!

చిరంజీవి అంతలా రాజకీయ పార్టీ విషయమై బ్రెయిన్‌ వాష్‌ చేసే వ్యక్తి అయితే, ముందుగా తన తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌కే ఆ పని చేసి వుండేవారు. పోనీ, పవన్‌ కళ్యాణ్‌, ఈ విషయంలో తన అన్నయ్య మాటని లెక్కచేయడనే అనుకుందాం. ఇంకో సోదరుడు నాగబాబు సంగతేంటి.? నాగబాబుని, చిరంజీవి.. జనసేన పార్టీ వైపు వెళ్ళనిచ్చేవారేనా.. ఒకవేళ రాజకీయాలపై చిరంజీవికి అంత ఏహ్యభావం వుంటే. రజనీకాంత్‌, చిరంజీవికి మంచి స్నేహితుడు. అయినాగానీ, చిరంజీవి ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో ఉచిత సలహాలు ఇవ్వరు. బ్రెయిన్‌ వాష్‌ అసలే చేయరు.

చిరంజీవి వ్యక్తిత్వం, మనస్తత్వం తెలిసినవారెవరైనాసరే.. ‘బ్రెయిన్‌ వాష్‌’ వంటి పదాలే ఆయన విషయంలో వాడరుగాక వాడరు. ఒకవేళ అవతలి వ్యక్తి చెబితే, ‘నా అభిప్రాయం ఇదీ..’ అని చెబతారేమో.! పైగా, రజనీకాంత్‌ రాజకీయ పార్టీ పెట్టేస్తున్నానని హంగామా చేసి, చివరికి చేతులెత్తేయడం అనేది ఇప్పుడు కొత్తగా జరిగిన వ్యవహారమేమీ కాదు. గతంలో చాలాసార్లు ఇలాగే జరిగింది. ఈసారి ‘అనారోగ్య సమస్య’ అనేది ఓ చిన్న ‘సాకు’ మాత్రమే.

ఆయన సమస్యలు ఆయనకున్నాయ్‌. ప్రస్తుత రాజకీయాలపై ఎంత అవగాహనతో వుండి వుంటే, ఆయన ఇన్నేళ్ళుగా రాజకీయ రంగ ప్రవేశంపై తటపటాయించినట్లు.? రజనీకాంత్‌, తమిళనాడుకు సంబంధించినంతవరకు రాజకీయంగా స్థానికేతరుడు. తమిళనాడులో లోకల్‌ రాజకీయం ఎలా వుంటుందో.. ఆ సెగ ఎంత తీవ్రంగా వుంటుందో ఆయనకీ బాగా తెలుసు. ఎవరో చెబితే, తన మనసు మార్చుకునేంత అమాయకుడైతే కాదు రజనీకాంత్‌.

ఎక్కడ ఏం జరిగినా, దాన్ని నెగెటివ్‌ యాంగిల్‌లో మెగా కాంపౌండ్‌కి లింక్‌ పెట్టేయాలనే ‘కక్కుర్తి’ తప్ప, రజనీకాంత్‌కి మెగాస్టార్‌ బ్రెయిన్‌ వాష్‌.. అనే ప్రచారంలో అర్థమేముంటుంది.?

Exit mobile version