తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడేంత హిట్. అంతకుమించి నటనలో రామ్ చరణ్ చూపిన పరిణితి ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది. బదిరుడి పాత్రలో, గ్రామీణ వాతావరణంలో దాదాపు మూడు దశాబ్దాల వెనుకటి కథలో రామ్ చరణ్ ఒదిగిపోయిన తీరు అద్భుతం. ప్రతి సన్నివేశంలో తాను చెవిటి వాడిగా చూపిన హావభావాలు, అన్న చనిపోయినప్పుడు చేసిన నటన, క్లైమాక్స్ లో ప్రకాశ్ రాజ్ దగ్గర నటన.. నభూతో నభవిష్యతి అని చెప్పాలి. ఇలాంటి ఘన విజయాలు టాలీవుడ్ లో ఉన్నా కానీ.. అరుదైన పాత్రల్లో ఒకటిగా మాత్రం ‘చిట్టిబాబు’ పాత్ర నిలిచిపోయింది. సుకుమార్ ఈ పాత్రను తీర్చిదిద్దిన విధానం, రామ్ చరణ్ నట విశ్వరూపం.. ఈ సినిమాను నాన్ బాహుబలి కేటగిరీలో ఇండస్ట్రీ హిట్ గా నిలిపింది.
ఏకంగా 236 కోట్ల కలెక్షన్లతో తొలి 200 కోట్ల మార్కును టాలీవుడ్ కి.. అదీ ఒక్క తెలుగు భాషలోనే అందించడం మరింత విశేషం. ఇన్ని అద్భుతాలు చేసిన రంగస్థలం విడుదలై నేటికి మూడేళ్లు. 2018 మార్చి 30న విడుదలైంది. 100 రోజుల సినిమా అనే మాటే మర్చిపోయిన నేటి రోజుల్లో.. ఓటీటీల్లో వచ్చినా కూడా 100 రోజులు 18 సెంటర్లలో రన్ కావడం టాలీవుడ్ చరిత్రలో లిఖించదగ్గదే. రామ్ చరణ్ పరంగా చూస్తే కలెక్షన్లు, రికార్డులే కాదు.. నటనలో కూడా చిరంజీవి కొడుకు చిరంజీవే అయ్యాడని మెగాభిమానులు మురిసిపోయారు. ‘రంగస్థలం’.. తెలుగు సినిమాపై చెరగని సంతకం..!