ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

టీటీడీ ఈవో మార్పుతో రమణ దీక్షితులు ‘పవర్‌’ పెరిగిందట

చంద్రబాబు హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వ్యవహారాలపై చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. ఆ సమయంలో వైఎస్‌ జగన్‌ పంచన చేరిన రమణ దీక్షితులు, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక, ‘టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు, సలహాదారు’గా నియమితులైన విషయం విదితమే. అంతకు ముందు వరకూ చేసిన ఆరోపణల సంగతి కొన్నాళ్ళు మర్చిపోయిన రమణ దీక్షితులు, టీటీడీ ఈవోతోనూ, టీటీడీ ఛైర్మన్‌తోనూ పొసగక మళ్ళీ ఆరోపణల పర్వం షురూ చేశారు. ‘చంద్రబాబు హయాంలో ఏం జరిగిందో, ఇప్పుడూ అదే జరుగుతోంది.. పెద్దగా మార్పు లేదు.. గతంలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు..’ అంటూ వాపోవడమే కాదు, కరోనా నేపథ్యంలోనూ టీటీడీపై బోల్డన్ని ఆరోపణలు చేశారు రమణ దీక్షితులు.

ఏమయ్యిందోగానీ, ప్రస్తుతం ఆయన సైలెంటయ్యారు. దీనంతటికీ కారణం టీటీడీ ఈవో మార్పు అనే చర్చ జరుగుతోంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జవహర్‌రెడ్డి తాజాగా టీటీడీ ఈవోగా బాధ్యతలు అందుకున్న విషయం విదితమే. అనిల్‌కుమార్‌ సింఘాల్‌, టీటీడీ ఈవో పదవి నుంచి వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ అయ్యారు. అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బదిలీ అవడం, జవహర్‌రెడ్డి రావడంతో రమణ దీక్షితులు ‘పవర్‌’ పెరిగిందనే చర్చ అటు టీటీడీ వార్గల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది. త్వరలో జరగనున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి ‘సలహాదారు’ హోదాలో ‘అంతకు మించి’ దర్పం రమణ దీక్షితులు ప్రదర్శిస్తున్నారనీ, ఆయనకి అనూహ్యంగా అత్యంత గౌరవం లభిస్తోందనీ అంటున్నారు.

అయితే, రమణ దీక్షితులు.. చిన్న చిన్న విషయాలకే గుస్సా అవుతుంటారనీ, తిరిగి తనను టీటీడీ ప్రధాన అర్చకులుగా నియమించాలనే డిమాండ్‌ నుంచి వెనక్కి తగ్గని ఆయన, ఆ అవకాశం దొరక్కపోతే మళ్ళీ విమర్శలు షురూ చేసే అవకాశం లేకపోలేదనే వారూ లేకపోలేదు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి ‘సేవ’ కోసమే ఈ రాద్ధాంతమా.? అంటే, కాదనే చెప్పాలి. టీటీడీ అంటే, చాలా వ్యవహారాలుంటాయి. అందుకే, రాజకీయ నిరుద్యోగులకు టీటీడీ ఎప్పటినుంచో పునరావాస కేంద్రంగా మారిపోయిందన్న విమర్శలున్నాయి. ఉత్త విమర్శలు కావు.. వాటిల్లో చాలావరకు వాస్తవమూ లేకపోలేదు.

Exit mobile version