అయితే, మళ్ళీ మరోమారు ఈ రమణ దీక్షితులు వార్తల్లోకెక్కారు. ‘చంద్రబాబు హయాంలో పరిస్థితికీ, ఇప్పటి పరిస్థితికీ పోల్చి చూసినప్పుడు టీటీడీలో మంచి మార్పులు ఏమీ రాలేదు..’ అంటూ రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని విక్రయించాలనుకోవడం మంచి ఆలోచన కాదని, ఆగమ పండితుల సలహా తీసుకోకుండానే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందని రమణ దీక్షితులు ఆరోపించారు.
‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి కొందరు తప్పుడు సలహాలు ఇస్తున్నారు. ఈ విషయంలో వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోక్యం చేసుకోవాలి. లేకపోతే, టీటీడీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం వుంది. భక్తుల మనోభావాల్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి..’ అంటూ రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు. అదే సమయంలో, వైఎస్ జగన్ ముక్కుసూటితనం గల మంచి వ్యక్తి అనీ, ఆయన తప్పక టీటీడీపై ప్రత్యేక దృష్టిపెడతారని ఆశిస్తున్నామనీ రమణ దీక్షితులు చెప్పడం గమనార్హం.
చంద్రబాబు హయాంలో టీటీడీ అనేక వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతకు ముందు ప్రభుత్వాల హయాంలోనూ అదే పరిస్థితి. ఇప్పుడూ అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఎస్వీబీసీలో ‘గుడి యెనక నా సామి’ వ్యవహారం అప్పట్లో పెను సంచలనం రేపిన విషయం విదితమే.
ఇక, తిరుపతి లడ్డూకి సంబంధించి రాయితీల్ని ఇటీవల టీటీడీ తొలగించడం పెను దుమారానికి కారణమయ్యింది. ఇప్పుడు సాక్షాత్తూ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడైన రమణ దీక్షితులే, టీటీడీలో జరుగుతున్న వ్యవహారాలపై గళం విప్పడం, లడ్డూ విక్రయాల్ని తప్పు పట్టడంతో.. ముందు ముందు ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు టీటీడీ విషయంలో జరుగుతాయో వేచి చూడాల్సిందే.