ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రానా సినిమా ఆగిపోయినట్టేనా!?

కరోనా వైరస్ ప్రభావం సినీ ఇండస్ట్రీపై తీవ్రంగా పడింది. ఈ మహమ్మారి కారణంగా ఇంకొన్నిరోజుల్లో గుమ్మడికాయ కొట్టాల్సిన సినిమాల షూటింగ్స్ అర్ధాంతరంగా నిలిచిపోగా, మరికొన్ని సినిమాలు టెంకాయ కూడా కొట్టకుండానే ఆగిపోతున్నాయి. ఇలా కరోనా కారణంగా షూటింగ్ మొదలెట్టకుండానే ఆగిపోయిన సినిమాల లిస్టులోకి దగ్గుపాటి రానా సినిమా కూడా చేరినట్టు టాక్.

‘రుద్రమదేవి’ సినిమా తర్వాత ‘హిరణ్య కశ్యప’ సినిమాను ప్రకటించాడు డైరెక్టర్ గుణశేఖర్. దగ్గుపాటి రానా హిరణ్యకశ్యకుడిగా కనిపించబోతున్నాడని కూడా ప్రకటించాడు. రానా ఎప్పటినుంచో చేయాలని కోరుకుంటున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు రూ.180 కోట్ల భారీ బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. రేపో మాపో ఈ మూవీ ప్రారంభమవుతుందని గుణశేఖర్ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న తరుణంలో కరోనా సంక్షోభం వచ్చింది.

ఇప్పుడు రానా మూవీపై అంత భారీ బడ్జెట్ పెట్టడమంటే చాలా పెద్ద రిస్క్ చేయడమే అవుతుంది. అదీగాక గుణశేఖర్ – రానా కాంబిపై డిస్టిబ్యూటర్లు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. అందుకే నిర్మాత సురేశ్ బాబు ఆలోచనల్లో పడ్డారట. కొడుకు కోసం ఇంత బడ్జెట్ పెడదామన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత రిస్క్ చేసేకంటే ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టడమే బెటర్ అనుకుంటున్నట్టు టాక్.

మరోవైపు రానా హీరోగా మూడు భాషల్లో భారీగా రూపొందిన ‘అరణ్య’ షూటింగ్ పూర్తిచేసుకుని, రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత కానీ ఈ మూవీ భవితవ్యం ఏమిటో తెలీదు. అలాగే ‘విరాట పర్వం’ మూవీలో రానా పార్ట్ షూటింగ్ మిగిలి ఉంది. ఈ రెండు సినిమాల రిజల్ట్‌ను బట్టి, హిరణ్య కశ్యపుడి గురించి ఆలోచించాలని డిసైడ్ అయ్యారట చిత్రయూనిట్.

Exit mobile version