ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

సపోర్ట్‌ రంగనాయకి మేడమ్: ఎవరీమె.! ఎందుకీ రగడ.?

సోషల్‌ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్‌లో వున్న హ్యాష్‌ట్యాగ్‌ ‘సపోర్ట్‌ రంగనాయకి మేడమ్’. ఎవరీమె.? ఎందుకు ఈమె పేరు ఇప్పుడు ఇంతలా పాపులర్‌ అవుతోంది.? అంటే, ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి విష వాయువు లీకై 12 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఈమె సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. అదే, ఆమె చేసిన నేరం. సీఐడీ బృందం ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఓ ఘటనపై స్పందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెడితే అరెస్ట్‌ చేసేస్తారా.? అని ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది.

ఆమె పెట్టిన పోస్ట్‌లో పలు ఆసక్తికరమైన ప్రశ్నలున్నాయి. నిజానికి అవేవీ తన ఆలోచనలు కావనీ, మల్లాడి రఘునాథ్‌ అనే వ్యక్తి కోట్‌ చేసిన విషయాల్నే తాను ప్రస్తావించానని, అంతే తప్ప ఇందులో తనకు ఎవరి మీదా ద్వేషం లేదని చెబుతున్నారు 66 ఏళ్ళ రంగనాయకి.

‘వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తల్లి వయసుంటుందామెకి.. అలాంటి రంగనాయకి మేడమ్ మీద దాష్టీకమా.?’ అంటూ టీడీపీ నుంచి వేలాది సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ నుంచి ప్రశ్నలు దూసుకొస్తున్నాయి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మీద. నిజానికి, రంగనాయకి ప్రస్తావించిన చాలా విషయాలు అటు నేషనల్‌ మీడియాలోనూ, ఇటు తెలుగు మీడియాలోనూ కన్పిస్తున్నవే. వాటిని క్రోడీకరించి ఎవరో ఓ పోస్ట్‌ తయారు చేశారు. వాటిని ఆమె పోస్ట్‌ చేశారు. ఓ దుర్ఘటన జరిగినప్పుడు, ఆ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తే అది నేరమవుతుందా.? ఇదెక్కడి న్యాయం.! అని ప్రపంచమంతా విస్తుపోతోంది.

ఇదొక్కటే కాదు, ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రభుత్వ పెద్దల్లో అసహనం పెరిగిపోతోంది. తాను ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు, ‘ప్రభుత్వంపై కడుపు మండితే సామాన్యులు సోషల్‌ మీడియాలో తమ ఆవేదనను చెప్పుకుంటారు.. అలా ప్రశ్నించినవారందర్నీ అరెస్ట్‌ చేసుకుంటూ పోతారా.?’ అని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. దురదృష్టం.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలోనూ అదే ‘అణచివేత’ కన్పిస్తోందన్నది నెటిజన్ల మాట.

రంగనాయకి పోస్ట్‌ని వేలాదిమంది టీడీపీ కార్యకర్తలే కాదు, ఇతరులూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఇంకా ఘాటుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అందరికీ నోటీసులు ఇవ్వాలంటే.. అందుబాటులో వున్న పేపర్లు సరిపోతాయా.? అరెస్టులు చేసుకుంటూ పోతే వున్న జైళ్ళు సరిపోతాయా.? అన్నది సోషల్‌ మీడియాలోనే కన్పిస్తోన్న మరికొన్ని పోస్టుల సారాంశం. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగులపై చర్యలు తీసుకోవాల్సిందే. కానీ, ఇలా ప్రశ్నించేవారిపై ఉక్కుపాదం మోపడం ఎంతవరకు సబబో జగన్ ప్రభుత్వం పునరాలోచించుకుంటే మంచిది.

Exit mobile version