ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రాజోలులో రాపాకకి షాక్: వైసీపీ కూడా తరిమికొట్టేసిందా.?

పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీకి బీభత్సమైన అడ్వాంటేజ్ వుంటుంది. మరి, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా చెలామణీ అవుతున్న జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎందుకు తన నియోజకవర్గంలో తన వాళ్ళని గెలిపించుకోలేకపోయారు.? ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్ల మీద అధికార వైసీపీకి చెందిన మద్దతుదారులు.. ఓటర్లకు హామీలు గుప్పించారు. అయినాగానీ, అధికార పార్టీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది.

పైగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నాలుగో విడత పంచాయితీ ఎన్నికలకు ముందు అంతర్వేది కొత్త రథానికి ప్రారంభోత్సవం చేసేందుకోసం భారీ హంగామాతో పబ్లిసిటీ స్టంట్లు చేశారాయె. ఏం చేసినా, గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితులు జనసేనకే అనుకూలంగా మారాయి. ‘మారింది రాపాక మాత్రమే.. ఓటర్లు కాదు..’ అంటూ జనసేన పార్టీ, రాజోలు నియోజకవర్గంలో సాధించిన పంచాయితీ స్థానాలతో పండగ చేసుకుంటోంది.

రాష్ట్రంలో ఎక్కడా లేనంత స్థాయిలో ప్రలోబాల పర్వం రాజోలులో నడిచిందన్నది స్థానికంగా వినిపిస్తోన్న మాట. జనసైనికుల్ని, జనసేన వీర మహిళల్ని ఎక్కడికక్కడ వేధింపులకు గురిచేసింది అధికార పక్షం. అయినాగానీ, జనసైనికులు ధైర్యంగా నిలబడ్డారు. రాపాకకి మర్చిపోలేని దెబ్బ కొట్టాలనుకున్నారు రాజకీయంగా.. కొట్టేశారు కూడా. ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నట్టు.. ఇటు రాపాక, ఇంకోపక్క వైసీపీ.. రెండూ జనసేన దెబ్బకు విలవిల్లాడాయి.

నిజానికి, గ్రామ స్థాయిలో వైసీపీ.. చాలా చోట్ల చాలా చాలా ఎక్కువ కష్టపడింది. ఓటుకి వెయ్యి రూపాయల నుంచి ఏడెనిమిది వేల రూపాయలదాకా పంచింది. బెదిరింపుల సంగతి సరే సరి. ఇవన్నీ రాజోలులో కూడా జరిగాయి. కానీ, అక్కడ జనసేన పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ‘అక్కుపక్షి’ రాతల్లో అచ్చుతప్పులు మామూలే. ఏ గ్రామంలో ఎవరు గెలిచారన్నది గెలిపించుకున్న గ్రామస్తులకే బాగా తెలుసు. ఈ వ్యవహారంపై రాపాకకి కూడా ఓ క్లారిటీ వచ్చేసింది.

‘వాపుని చూసి బలుపు అనుకున్నామేమో..’ అంటూ వైసీపీలోకి రావడంపై రాపాక పునరాలోచనలో పడ్డారన్నది ప్రస్తుతం నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. ‘దయచేసి రాపాకని జనసేనలోకి రానివ్వద్దు..’ అని జనసైనికులు, అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాపాక, రాజోలులో రాజకీయంగా దెబ్బతినేశారు సరే.. జనసేనతోపాటు, వైసీపీ దెబ్బ కూడా ఆయనకి తగిలిందా.? స్థానికంగా రాపాక చూపిన అత్యుత్సాహమే.. రాపాకకీ, వైసీపీకీ షాక్ తగిలేలా చేసిందా.? అంటే ఔననే అనుకోవాలేమో.

Exit mobile version