ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

తిరుపతి బై పోల్: గెలిచినా ఓడినా రత్నప్రభకు ఎదురే లేదట.!

‘వైసీపీకి 2019లో 22 మంది ఎంపీలు దక్కారు. కానీ, ఏం లాభం.? తిరుపతిలో వైసీపీ గెలిస్తే పెద్దగా మార్పు ఏమీ వుండదు. అదే, బీజేపీ గెలిస్తే.. అద్భుతాలు చేసి చూపించేస్తాం..’ అంటోంది భారతీయ జనతా పార్టీ. అత్యంత వ్యూహాత్మకంగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభను తిరుపతి నుంచి జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ఖరారు చేసిన విషయం విదితమే. ‘గెలిస్తే, రత్నప్రభ కేంద్ర మంత్రి అవుతారు.. విశాఖను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తారు..’ అని బీజేపీ చెబుతోంది. కేంద్ర మంత్రి పదవితోనే రత్న ప్రభను తిరుపతి అభ్యర్థిగా బీజేపీ ఖరారు చేసిందనే ప్రచారం జరుగుతోంది. రత్న ప్రభ కూడా అదే ధీమాతో వున్నారట.

మరో ఆసక్తికరమైన గాసిప్ రాజకీయ వర్గాల్లో విన్పిస్తోంది రత్నప్రభ విషయమై. అదేంటంటే, తిరుపతి ఉప ఎన్నికలో గెలవకపోయినా, రత్నప్రభకు బీజేపీ మరో ఆఫర్ కూడా ఇచ్చేందుకు సిద్ధంగా వుందట. రాజ్యసభకు ఎంపిక చేయడం, తద్వారా కేంద్ర మంత్రిని చేయడం.. లేదంటే, గవర్నర్ పదవికి ఆమెను సిఫార్సు చేయడం.. వంటి ప్రతిపాదనలు కూడా రత్నప్రభ ముందు బీజేపీ వుంచిందట. ఇవన్నీ నిజంగానే నిజమా.? లేదంటే, తిరుపతి ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవడానికి బీజేపీ చేస్తున్న ఉత్తుత్తి ప్రచారమేనా.? అన్నది తేలాల్సి వుంది. బీజేపీ నుంచి కంభంపాటి హరిబాబు తదితర సీనియర్ నేతలు చాలామందే వున్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన బీజేపీకి వుండి వుంటే, రాజ్యసభకు పంపడం ద్వారా ఏపీ బీజేపీ సీనియర్ నేతల్లో ఎవరో ఒకరికి కేంద్ర మంత్రి పదవిని మోడీ సర్కార్ ఇచ్చి వుండేదే. ఇదిలా వుంటే, మిత్రపక్షం జనసేన ఇప్పుడిప్పుడే కాస్త, బీజేపీకి సహకరించేందుకు ముందుకొస్తోంది. రత్నప్రభ గెలుపు కోసం జనసేన శ్రేణులు సహకరిస్తాయంటూ జనసేన ముఖ్య నేతలు చెబుతున్నారు.

మరోపక్క, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో సమావేశమయ్యేలా అపాయింట్‌మెంట్లను ఖరారు చేసేందుకు బీజేపీ ఏపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. ఈ భేటీ ఢిల్లీలో జరుగుతుందా.? తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో తిరుపతిలోనే జరుగుతుందా.? అన్నది తేలాల్సి వుంది.

Exit mobile version