మాటల్లో చెప్పలేని చాలా భావాలను ఒక్క ముద్దులో పలికించొచ్చని అంటుంటారు మన ఫిలిం మేకర్స్. హీరో హీరోయిన్లు సైతం లిప్ లాక్ సీన్స్ లో నటించడానికి అభ్యంతరం చెప్పడం లేదు. గతంలో ఇలాంటి కిస్సింగ్ సీన్లకు నో చెప్పేవారు మన ముద్దుగుమ్మలు. కానీ ఇప్పుడు దేనికైనా సిద్ధమంటున్నారు. ముద్దు అనేది జాతీయ సమస్య కాదని.. అదేం పెద్ద విషయం కూడా కాదని అంటున్నారు.
‘ము.. ము.. ముద్దంటే చేదా.. నీకా ఉద్దేశం లేదా’ అన్న పాట చాలా మందికి గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు అందరూ ముద్దంటే తీపి అంటున్నారు. ఘాటు కిస్సుల గురించి మన హీరోహీరోయిన్లను అడిగితే.. వారి నోటి నుండి వచ్చే జవాబు ‘కథ డిమాండ్ చేసింది.. అదే సినిమాలో అసలు పాయింట్.. ఆ సీన్ స్టోరీకి సోల్’ అని చెబుతూ ఉంటారు.
‘ముద్దులదా.. బుగ్గలదా.. పెనవేసుకున్న పెదవులదా..’ అంటూ ముద్దులతో పాటని నింపేస్తున్నారు. అన్ని సినిమాల్లో కిస్సింగ్ సీన్స్ కామన్ అయిపోవడంతో వాటి గురించి పెద్దగా చర్చలు కూడా జరగడం లేదు. అయితే ఇప్పుడు సీనియర్ హీరోలు.. ఎప్పుడు అలాంటి వాటి గురించి ఆలోచించని హీరోలు సైతం ఇప్పుడు లిప్ లాక్ సీన్స్ చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.
‘మన్మథుడు 2’ సినిమాలో అక్కినేని నాగార్జున గాఢమైన చుంబన దృశ్యాల్లో నటించి అందరినీ షాక్ కి గురి చేసారు. ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉండే నాని.. ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో కృతి శెట్టితో లిప్ లాక్ సీన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలో చేసిన లిప్ టూ లిప్ కిస్సింగ్ సీన్ సోషల్ మీడియాలో చర్చనీయంగా మారింది.
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడీ’ మూవీ ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. ఇందులో మీనాక్షి చౌదరి – రవితేజ మధ్య ఒక ఉద్వేగభరితమైన లిప్ లాక్ ఉంది. సినిమాలో మరో హీరోయిన్ తో కూడా ఇలాంటి సీన్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో రవితేజ లిప్ లాక్ లకు దిగడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు.
కథకు లిప్ లాక్ అవసరం అనుకున్నప్పటికీ.. సీనియర్ హీరోలు ఈ ఏజ్ లో అలాంటి సీన్స్ చేయడం అవసరమా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. యువ హీరోల సినిమాల్లో లిప్ లాక్ లకు పెద్దగా ప్రయోజనం అవసరం లేదు. అవి ఉంటే యూత్ ఆడియన్స్ థియేటర్లకు వస్తారని మేకర్స్ భావిస్తారు కూడా. అందుకే ‘డీజే టిల్లు’ సినిమాలో సిద్దు జొన్నల గడ్డ – నేహశర్మ మధ్య లిప్ లాప్ గురించి పెద్దగా చర్చ జరగలేదు.
కానీ సీనియర్ స్టార్ హీరోలు తమకన్నా వయసులో చాలా చిన్నవారైన యువ కథానాయికలతో లిప్ లాక్స్ చేస్తుండటం ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి ఈ రకమైన రొమాన్స్ ని బిగ్ స్క్రీన్ మీద చూడటానికి ఎవరూ ఇష్టపడరు. మరి రాబోయే రోజుల్లో మన సీనియర్ హీరోలు ముద్దు సన్నివేశాల విషయంలో కాస్త ఆలోచిస్తారేమో చూడాలి.