గతంలో టీడీపీలో కీలకంగా పనిచేసిన టీడీపీ నేతలు ఎర్రశేఖర్ గండ్ర సత్యనారాయణరావులు మంగళవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎర్రశేఖర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. గండ్ర సత్యనారాయణ టీఆర్ఎస్ లో చేరారు. వీరిద్దరూ కూడా రేవంత్ తో భేటి కావడంతో కాంగ్రెస్ లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మంగళవారం భేటి అయ్యారు. బీజేపీ అధ్యక్ష పదవికి ఎర్రశేఖర్ గతంలో రాజీనామా చేశారు. పార్టీ నాయకత్వం బుజ్జగింపుతో ఆయన తిరిగి ఈ పదవిలో కొనసాగుతున్నారు. గతంలో టీడీపీ నుంచి జడ్చర్ల ఎమ్మెల్యేగా ఎర్రశేఖర్ పనిచేశారు. టీడీపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. టీడీపీ నుంచి బీజేపీలోచేరారు. బీజేపీలో ఆయన పొసగడం లేదు. దీంతో రేవంత్ రెడ్డితో తాజాగా భేటి కావడం విశేషం.
ఇక టీఆర్ఎస్ లో చేరిన మాజీ టీడీపీ నేత గండ్ర సత్యనారాయణరావు కూడా ఎర్రశేఖర్ తో కలిసి రేవంత్ రెడ్డితో భేటి అయ్యారు. స్తానికంగా ఉన్న పరిస్థితులు.. టీఆర్ఎస్ లో పోటీ కారణంగానే వారు కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది.
-బీజేపీ ఎంపీ అరవింద్ సోదరుడు కాంగ్రెస్ లోకి..
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బలపర్చడానికే తిరిగి కాంగ్రెస్ లోకి వస్తున్నానని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. మంచి రోజు చూసుకొని కాంగ్రెస్ లో చేరుతానన్నారు. తన తండ్రి డీఎస్ కోసం టీఆర్ఎస్ కండువా కప్పుకున్నానని చెప్పారు. కానీ అది కండువా కాదని.. గొడ్డలి అని తనకు తెలుసు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో పోలిస్తే టీఆర్ెస్ పార్టీయే కాదన్నారు.
ఇక తన తమ్ముడు బీజేపీ నిజామాబాద్ ఎంపీగా ఉంటే తనకేంటి అని ధర్మపురి సంజయ్ అన్నారు. రేవంత్ రెడ్డితో భేటి అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే చాలా మంది వైఎస్ హయాంలో వెలుగు వెలిగి వివిధ పార్టీలోకి వెళ్లిన వారందరినీ ఏకం చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రతి జిల్లాలో పర్యటిస్తూ ఫోన్లు చేస్తూ పాత కాంగ్రెస్ నేతలు తిరిగి రావాలని కాంగ్రెస్ లో చేరాలని పిలుపునిస్తున్నారు.
ఇప్పటికే పాత టీడీపీ నేతలంతా రేవంత్ వైపు చూస్తున్నారు. ఎల్.రమణ రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరడం.. ఇప్పటివరకు ఉన్న టీడీపీ క్యాడర్ అంతా ఓవర్ లోడ్ అయిన టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బెటర్ అని ఇటువైపు వస్తున్నారు. సో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మరింత బలంగా తయారవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.