ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అయ్యయ్యో.. వర్మ, వైఎస్ జగన్‌ని అంత మాట అనేశాడేంటీ.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 2014 నుంచి 2019 వరకు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మని ఎడా పెడా వాడేసింది. వర్మతో పలువురు వైసీపీ నేతలు, వైసీపీ మద్దతుదారులు సినిమాలు నిర్మించారు.. అది కూడా, టీడీపీకి వ్యతిరేకంగా.. పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా. ఈ క్రమంలో వర్మ ఎదుర్కొన్న విమర్శలు, వివాదాలు అన్నీ ఇన్నీ కావు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రామ్ గోపాల్ వర్మ అప్పట్లో బాహాటంగానే మద్దతు పలికాడు. ఇప్పటికీ మద్దతు పలుకుతూనే వున్నాడు. ఏమయ్యిందోగానీ, ఈ మధ్య వర్మ స్వరంలో మార్పు కనిపిస్తోంది. సినిమా థియేటర్ల రగడ, టిక్కెట్ల వివాదంపై రామ్ గోపాల్ వర్మ, వైఎస్ జగన్ సర్కారుకి వ్యతిరేకంగా మాట్లాడుతుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

‘‘సినిమాకీ, ఆ సినిమా చూసే ప్రేక్షకుడికీ మధ్యన దూరాల్సిన అవసరం ప్రభుత్వానికేంటి.? సినిమా టిక్కెట్ల ధరల విషయంలో జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వానికి లేదు..’ అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు.. అదీ వైసీపీకి కొమ్మకాస్తోన్న ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో.

‘ఇడ్లీ తినాలనుకునేవాడు.. తన ఆర్థిక స్తోమతును బట్టి ఐదు రూపాయలో.. ఐదు వందలో వెచ్చించి.. తాను తినాలనుకున్న చోట తింటాడు. ఐదు రూపాయలకే ఇడ్లీ అమ్మాలని స్టార్ హోటల్‌కి నిబంధన పెట్టగలమా.? సినిమా టిక్కెట్టు కూడా అంతే..’ అని వర్మ చెప్పుకొచ్చాడు.

మామూలుగా అయితే, వర్మ వితండవాదమే చేస్తాడు. అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఈసారెందుకో, వర్మ మాటల్లో ఒకింత స్పష్టత కనిపిస్తోంది. ‘సినిమా అంటే వినోదం.. ఆ వినోదాన్ని సామాన్యుడికి అందుబాటు ధరకే అందించాలనేది మా ప్రయత్నం..’ అని మంత్రి పేర్ని నాని చెప్పగా, ‘అలాగైతే, ప్రజలకు అందుబాటు ధరల్లో మీరు ఇవ్వాల్సినవి చాలా వున్నాయి. వాటి గురించి ఆలోచించండి..’ అంటూ వర్మ కౌంటర్ ఎటాక్ చేసేశాడు.

వైసీపీ అనుకూల మీడియాకి చెందిన జర్నలిస్టు కావొచ్చు, వైసీపీ మంత్రి కావొచ్చు.. వర్మ ప్రశ్నలకు సమాధానమివ్వలేకపోవడం గమనార్హమిక్కడ.

Exit mobile version