ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

‘చెక్కులు ఉంటే ఎందుకు క్యాష్ చేసుకోలేదు?’.. వివాదంపై ఆర్జీవీ తాజా ప్రెస్ నోట్..!

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘డేంజరస్’ సినిమా చుట్టూ వివాదాలు అల్లుకున్నాయి. డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ ఈ మూవీ రిలీజ్ ను అడ్డుకున్న నేపథ్యంలో తెర మీదకొచ్చిన ఈ వివాదం.. చిలికి చిలికి గాలి వానలా మారుతోంది.

ఆర్జీవీ – నట్టి కుమార్ ఇరువురూ నువ్వా నేనా అనే విధంగా ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. కయ్యానికి కాలు దువ్వుతూ ఇద్దరూ పోటాపోటీగా ప్రెస్ నోట్లతో దాడి చేసుకుంటున్నారు. రామ్ గోపాల్ వర్మ తనకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి చెల్లించకుండా మోసం చేశాడంటూ ‘మా ఇష్టం’ రిలీజ్ పై స్టే తీసుకొచ్చారు నట్టి.

అయితే నట్టి కుమార్ ఫోర్జరీ డాక్యూమెంట్స్ తో మోసం చేశాడని చెబుతూ.. అతనిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లుగా ఆర్జీవీ ఓ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశాడు. నట్టి క్రాంతి – నట్టి కరుణ కుట్ర పన్ని ఫోర్జరీ పత్రాల ఆధారంగా సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి తన చిత్రాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు.

కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ను ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసిందని.. క్లియరెన్స్ ఆర్డర్ వచ్చింది కనుక ‘మా ఇష్టం’ సినిమాను మే 6న రిలీజ్ చేయబోతున్నామని వర్మ పేర్కొన్నారు. అయితే నట్టి కుమార్ దీనికి కౌంటర్ గా తన తరపు నుండి ఓ ప్రెస్ నోట్ ని విడుదల చేశారు.

‘రాంగోపాల్ వర్మ.. నీవు ఆడుతున్న నాటకాలు ఎవరికి తెలియవు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లతో స్నేహం నటించి వారి చేత నీ సినిమాలకు పెట్టుబడులు పెట్టించుకుని ఆ తర్వాత మోసగించడం నీకు తెలిసినంతగా సినీ పరిశ్రమలో ఇంకెవరికీ తెలియకపోవచ్చు. మోసపోయిన వాళ్లంతా నీ నిజస్వరూపాన్ని ఇంతవరకు బయట పెట్టకపోవడం వల్లే నీ చేతుల్లో ఇంకా మోసపోతూనే ఉన్నారు. నీ పాపాలు పండే సమయం ఆసన్నమయ్యింది’ అని నట్టి ఘాటుగా స్పందించారు.

‘స్వయంగా నువ్వు ఇచ్చిన డాక్యూమెంట్స్ ను కూడా ఫోర్జరీ అంటున్నావంటే.. నీది ఎలాంటి క్రిమినల్ మెంటాలిటీనో అర్ధం చేసుకోవచ్చు. నువ్వు ఇచ్చిన ఈ చెక్కులు.. నీ బ్యాంకు అకౌంట్ లు కూడా ఫోర్జరీనే అంటావా?. ఎట్టిపరిస్థితులలో నీ నిగ్గు తేలుస్తాం. మేము కోర్టుకు వెళ్ళి ఆధారాలు పెట్టి మరీ స్టే తెచ్చాం. నువ్వు ఎలాంటి ప్రూప్స్ లేకుండానే మాకు నువ్వు ఇచ్చినవే ఫోర్జరీ డాక్యూమెంట్స్ అంటున్నావు అంటే నీ నిజ స్వరూపం నీ నమ్మక ద్రోహం ఎలాంటిదో ఇట్టే చెప్పవచ్చు’ అని నట్టి కుమార్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో నట్టి కుమార్ కు పలు ప్రశ్నలు సంధిస్తూ.. రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో ప్రెస్ నోట్ విడుదల చేసారు. ”మీ దగ్గరున్న చెక్స్ కరెక్ట్ అయితే వాటిని క్యాష్ ఎందుకు చేసుకోలేదు..? మీ కేసులో విషయముంటే హైకోర్ట్ సస్పెండ్ ఎందుకు చేసింది..? నా దగ్గర మోసపోయిన ప్రొడ్యూసర్లందరిని చేరుస్తానన్నారు.. వాళ్ళెక్కడ..?” అని ఆర్జీవీ ప్రశ్నించారు.

వర్మ ప్రెస్ మీట్ లో ఇంకా ఏముందంటే.. ”నా గురించి నేనెంత మోసగాడినో మీకు అన్ని ఏళ్లుగా తెలిసుంటే మొన్న మొన్నటివరకు నన్నెందుకంత పొగిడారు..? ‘అడివి’ సినిమా నుంచి నిన్న మొన్నటి ‘మర్డర్’ సినిమా వరకూ నా చుట్టూ తిరిగి ఇప్పుడు సడెన్ గా నా గురించి జ్ఞానోదయం అయ్యిందా..? నాకు సినిమాలు తీయటం రాదు ఒకే… మరి మీ కొడుకుతో మీ కూతురితో సినిమాలు తీసి వాళ్ళ కెరియర్లు ఫినిష్ చేసిన సంగతేంటి..?”

”ధనుష్ – అడ్డాల చంటి – సురేష్ బాబు – దిల్ రాజు – సి.కళ్యాణ్ – అశోక్ కుమార్ – భాను – రామ సత్యనారాయణ – అచ్చం నాయుడు – సునీల్ నౌరాంగ్ – నారాయణ దాస్ నౌరాంగ్ – రాం చరణ్ – నిఖిల్ – నాని – అల్లు అరవింద్ – మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఎన్నో వందలమందితో మీకున్న హిస్టరీ మర్చిపోయారనుకుంటున్నారా..?”

”మీకు కానీ మీతో గాని ప్రాబ్లెమ్ లేని వాడు అసలు ఈ భూ ప్రపంచంలో ఉన్నాడా..? మీరు ప్రెస్ మీట్లు గ్రూప్స్ లో మెసేజ్లు పెడతానే వుండండి.. అవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాము.. వాటి ఫైనల్ రిజల్ట్ మీకు అతి త్వరలో తెలుస్తుంది. థ్యాంక్స్ అండి!” అని రామ్ గోపాల్ వర్మ ప్రకటనలో పేర్కొన్నారు.

Exit mobile version