బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ అనుమానాస్పద మరణం కేసులో రియా చక్రవర్తిపై ఆరోపణలున్నాయి. దాంతోపాటుగా, డ్రగ్స్ ఆరోపణలు కూడా రియా చక్రవర్తిపై వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రియా చక్రవర్తిని ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో’ (ఎన్‌సిబి) అరెస్ట్ చేసింది. ఆమె నుంచి చాలా వివరాలు రాబట్టిన ఎన్‌సిబి, పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ‘శ్రీముఖాలు’ పంపిన విషయం విదితమే.
కేసులో ఆధారాల్లేకుండా ఎన్‌సిబి లాంటి ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ విచారణ చేపడుతుందా.? అరెస్టు చేస్తుందా.? స్వరా భాస్కర్ తీరు ఎలా వుందంటే, న్యాయస్థానాలతో పనిలేదు.. నేనే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నా.. అన్నట్లుంది. నిజమే.. రియా చక్రవర్తి విషయంలో మీడియా అత్యుత్సాహం చూపించింది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఓ మహిళగా ఆమె పట్ల కనీసపాటి మర్యాద కూడా మీడియా పాటించలేదు. కానీ, రాజకీయాల్లోనూ.. మీడియాలోనూ ఇప్పుడు విలువల గురించి మాట్లాడితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
సినీ పరిశ్రమ ఇందుకు మినహాయింపేమీ కాదు. సినిమాల్లో మీడియాపై సెటైర్లు వేస్తారు.. ఆ సినిమాని మీడియా టార్గెట్ చేస్తుంటుంది. ఇదొక నిరంతర ప్రక్రియ. ఇది తెలియనంత అమాయకురాలేం కాదు స్వరా భాస్కర్. ఎందుకంటే, మీడియాలో ఎలా పబ్లిసిటీ తెచ్చుకోవాలో ఆమెకు తెలుసు. ఏ వివాదాన్ని కెలికితే ఎంత పబ్లిసిటీ వస్తుందన్న లెక్కలు స్వరా భాస్కర్ దగ్గర పక్కాగా వుంటాయి. అందుకే, రియా చక్రవర్తి కేసులోనూ లెక్కలేసుకుని మరీ అత్యుత్సాహం చూపుతోంది.
రియా చక్రవర్తిని అరెస్ట్ చేయడం, ఆమె నేరం చేసిందనడానికి తగిన ఆధారాలు చూపడం వరకే ఎన్‌సిబి పని. ఆమెను జైలు నుంచి విడుదల చేయాలా.? వద్దా.? అన్నది నిర్ణయించాల్సింది న్యాయస్థానాలే.