టాలీవుడ్ లో రెండు పెద్ద సినీ ఫ్యామిలీలకు చెందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా కావడంతో అందరిలో RRR మీద రెట్టింపు ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రమోషన్స్ తో హోరెత్తిస్తున్న మేకర్స్.. సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చారు. ఓ వైపు స్పెషల్ ఇంటర్వ్యూలు – భారీ ఈవెంట్స్.. మరోవైపు సరికొత్త పోస్టర్లు – గ్లింప్స్ లతో సందడి చేస్తున్నారు. న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ లో కూడా RRR ప్రచారం నిర్వహిస్తున్నారు.
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. దీనికి తగ్గట్లుగానే అన్ని భాషల్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కనీవినీ ఎరుగని రీతిలో మరే తెలుగు సినిమాకు జరగని విధంగా ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ – స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వంటి ప్రముఖులను గెస్టులుగా తీసుకొచ్చి RRR టీమ్ నార్త్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు.
ఈ క్రమంలో త్వరలోనే హైదరాబాద్ లో మరో రోరింగ్ ఈవెంట్ ను ప్లాన్ చేసిన ట్రిపుల్ ఆర్ బృందం.. ఇప్పటికే దీని కోసం ఏర్పాట్లు మొదలు పెట్టారని తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి గెస్టులుగా ఎవరు హాజరవుతారనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు అటెండ్ అవుతారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. వారెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి – నటసింహం నందమూరి బాలకృష్ణ అని అంటున్నారు.
రామ్ చరణ్ – ఎన్టీఆర్ లను ఒకే సినిమాలో భాగం చేసి.. అసాధ్యం అనుకున్న మెగా – నందమూరి కాంబినేషన్ ను సుసాధ్యం చేశారు జక్కన్న. ఇప్పుడు అదే ఫ్యామిలీలకు చెందిన ఇద్దరు బిగ్ స్టార్స్ చిరంజీవి – బాలయ్య లను ఒకే వేదిక మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించి ఈరోజో రేపో అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఒకవేళ నిజమైతే మాత్రం RRR ఈవెంట్ అభిమానులకు కన్నుల పండుగగా మారుతుందనడంతో సందేహం లేదు. బాక్సాఫీస్ వద్ద పోటీ పడే నందమూరి – మెగా కుటుంబాలకు చెందిన రెండు తరాల హీరోలు.. ఒకే వేదిక మీద కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. మరి అలాంటి అరుదైన అవకాశాన్ని ‘ఆర్.ఆర్.ఆర్’ అందిస్తుందో లేదో చూడాలి.
కాగా విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు – కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల స్పూర్తితో ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో రామారాజు గా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఆలియా భట్ – ఒలివియా మోరీస్ కథానాయికలుగా నటించారు. అజయ్ దేవగన్ – శ్రియా – సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో RRR మూవీ విడుదల కానుంది.