మూడు వారాల కిందటే తెలంగాణ ప్రభుత్వం.. ఏపీకి బస్సులు నడిపేందుకు అంగీకారం తెలిపింది. కానీ ఏపీ మాత్రం అందుకు అంగీకరించలేదు. ఆ రాష్ట్రం కూడా అంతర్ రాష్ట్ర సర్వీసులకు పచ్చ జెండా ఊపబోతోందని అంటూనే ఉన్నారు కానీ.. ఎంతకీ విషయం తేలలేదు.
రెండు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో ఈ విషయం ముందడుగు పడలేదు. కానీ ఇలా ఎంతో కాలం గేట్లు మూసేస్తే కష్టమని.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు భావించినట్లున్నాయి.
ఎట్టకేలకు అంతర్ రాష్ట్ర సర్వీసులకు ఇరు రాష్ట్రాలూ ఉమ్మడిగా పచ్చజెండా ఊపినట్లే కనిపిస్తున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున అధికారుల మధ్య చర్చలు జరిగాయి. తెలంగాణ అధికారులు.. విజయవాడకు వెళ్లి అక్కడి అధికారులతో సమావేశం అయ్యారు. ఇంకో వారం రోజుల్లో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఇరువురి మధ్య అంగీకారం కుదిరింది.
త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. వెంటనే బుకింగ్స్ మొదలవుతాయి. ఇంతకుముందే తెలంగాణ నుంచి ఏపీకి కొన్ని ప్రత్యేక సర్వీసులు నడపడం ద్వారా హైదరాబాద్‌లో చిక్కుకున్న వాళ్లను స్వరాష్ట్రానికి రప్పించడానికి ఏపీ ప్రయత్నం చేసింది. బుకింగ్స్ కూడా జరిగాయి. కానీ చివరి నిమిషాల్లో అవన్నీ రద్దు చేశారు.
ఈసారి మాత్రం వెనకడుగు ఉండదని.. వారం రోజుల్లో ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయని.. దీంతో పాటే ప్రైవేటు బస్సులకు కూడా అనుమతులు ఇస్తారని.. కరోనా జాగ్రత్తల మధ్య బస్సులు నడిపేలా జాగ్రత్తలు తీసుకుంటారని అంటున్నారు.