మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. కరోనా వల్ల ఆలస్యం అవుతున్న ఆ సినిమా త్వరలోనే మళ్లీ పునః ప్రారంభం అవ్వబోతుంది. ఆ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’ ను చిరు రీమేక్ చేస్తాడని ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. అధికారిక ప్రకటన త్వరలో రాబోతుంది. ఈ సమయంలో సాయి పల్లవిని ఈ సినిమా కోసం సంప్రదించారు అంటూ వార్తలు వస్తున్నాయి. చిరంజీవికి జోడీగా సాయి పల్లవి నటించబోతుందా అంటూ చాలా మంది అనుకుంటున్నారు. చిరు మూవీలో సాయి పల్లవి నటిస్తున్న విషయం నిజమే కాని హీరోయిన్ గా కాదు అంటూ సమాచారం అందుతోంది.
వేదాళం సినిమాలో అజిత్ కు చెల్లి పాత్రలో లక్ష్మీ మీనన్ నటించింది. హీరో చెల్లి పాత్రకు సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే తెలుగు రీమేక్ లో ఒక హీరోయిన్ ను నటింపజేయాలని భావించారు. సాయి పల్లవి అయితే ఇలాంటి పాత్రకు బాగుంటుందని భావించారట. ఆమె కూడా హీరోయిన్ గానే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయాలని ఉబలాట పడుతుంది. కనుక వేదాళం రీమేక్ కు దాదాపుగా కన్ఫర్మ్ చేసిందట. చిరంజీవికి చెల్లి పాత్రలో నటించేందుకు సాయి పల్లవి రెడీగా ఉందని సమాచారం అందుతోంది.
ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. కేవలం మూడు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ చిత్రం తర్వాత బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమాను చేయబోతున్నాడు. ఇదే సమయంలో మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ ను కూడా చిరు రీమేక్ చేయాల్సి ఉంది. కనుక ఖచ్చితంగా ఈ మూడు సినిమాలను స్పీడ్ గా తక్కువ సమయంలోనే చేయాలనుకుంటున్నాడు. వచ్చే ఏడాదిలో చిరంజీవి రెండు లేదా మూడు సినిమాలు వచ్చినా ఆశ్చర్యం లేదని మెగా వర్గాల వారు అంటున్నారు.