ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

శంషాబాద్‌లో గొడవ గొడవ

కరోనా కారణంగా రెండు నెలలకు పైగా ఆగిపోయిన విమాన యానాన్ని ఈ రోజే పునరుద్ధరుంచింది కేంద్ర ప్రభుత్వం. దేశీయంగా పూర్తి స్థాయిలో కాకపోయినా.. నిర్దిష్ట సంఖ్యలో విమానాల్ని పునరుద్ధరించారు. కొన్ని రోజుల కిందటే బుకింగ్స్ మొదలయ్యాయి.

దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన, వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్న వాళ్లంతా టికెట్లు తీసుకుని సిద్ధమయ్యారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్లంతా సోమవారం అన్ని ఏర్పాట్లూ చేసుకుని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. కానీ తీరా అక్కడికి వెళ్లాక విమాన సంస్థలు షాకుల మీద షాకులిచ్చాయి. ఏ సమాచారం లేకుండా చాలా విమానాలు రద్దయిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

మొత్తం ఈ రోజుకు 100 విమానాల దాకా షెడ్యూల్ చేసి టికెట్లు అమ్మగా.. అందుబాటులోకి వచ్చింది 30 విమానాలు మాత్రమే. 70 విమానాల దాకా అసలే సమాచారం లేకుండా రద్దు చేసేయడంతో వందల మంది ప్రయాణికులు విమనాశ్రయంలో ఇబ్బందులు పడ్డారు. వీరంతా కొన్ని గంటల పాటు ఎదురు చూశాక విమానాలు రద్దయినట్లు ప్రకటించడంతో వారిలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎయిర్ పోర్టులో వీరంతా ఆందోళన బాట పట్టారు. విమాన సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. ఢిల్లీలో 82 విమానాలు రద్దు చేస్తున్నట్లు చివరి నిమిషాల్లో ప్రకటించారు. కరోనా నేపథ్యంలో కొన్ని గంటల పాటు స్క్రూటినీ తర్వాత ప్రయాణికుల్ని ప్రయాణాలకు అనుమతిస్తుండటంతో ఎయిర్ పోర్టుల్లో భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. రెండు నెలలు నిరీక్షించి.. ఎట్టకేలకు టికెట్లు బుక్ చేసుకుని ఎంతో కష్టపడి ఎయిర్ పోర్టుకు చేరుకుని.. కొన్ని గంటల నిరీక్షణ తర్వాత ఫ్లైట్లు క్యాన్సిల్ అంటే ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు.

Exit mobile version