ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

శర్వానంద్‌ సినిమా బాగున్నా కలెక్షన్లు రావట్లే

టాలీవుడ్‌లో విభిన్న కథలు ఎంచుకోవడంలో యువ కథానాయకుడు శర్వానంద్‌ ఎప్పుడూ ముందుంటాడు. తన సినిమాలకు మంచి టాక్‌ వస్తున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. ఇటీవల తను నటించిన ‘శ్రీకారం’ చిత్రం విడుదలవగా, మొదటి ఆటతోనే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. విమర్శకులు సైతం యువతకు ప్రేరణ అని, వారు తప్పక చూడాలని మెచ్చుకున్నారు. ఇంకేముంది హిట్‌ ఖాయమని చిత్ర యూనిట్‌ సభ్యులంతా సంబరపడిపోయారు. కానీ అనుకొన్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్న చందంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది.

వస్తే వరుస హిట్లు, లేదా వరుస ఫ్లాపులు
శర్వానంద్‌ కెరీర్‌ను చూస్తే ‘రన్ రాజా రన్’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’ సినిమాల వరుస హిట్లతో అతడి మార్కెట్ బాగానే పెరిగింది. మధ్యలో ‘రాధ’ నిరాశ పరిచినా.. ‘మహానుభావుడు’తో మళ్లీ హిట్‌ ట్రాక్‌లో పడ్డాడని అనుకున్నారంతా! ఇంకేముంది సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కట్టారు. కానీ మహానుభావుడు తర్వాత ఆ హవాను కొనసాగించలేకపోయాడు. ప్రేమ కథా చిత్రంగా విడుదలైన ‘పడి పడి లేచే మనసు’ శర్వా కెరీర్లోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమా అయింది. తర్వాత ‘రణరంగం’ కూడా అంతగా ఆడలేదు. తమిళ రీమేక్‌ ‘జాను’ పర్వాలేదనిపించింది.

తర్వాత వచ్చిన ‘శ్రీకారం’ అయినా అతడిని పరాజయాల బాట నుంచి బయట పడేస్తుందని అంతా అనుకున్నారు. ఈ సినిమా మంచి టాకే తెచ్చుకునప్పటికీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. దీనికి ప్రధాన కారణం చిన్న సినిమా అనుకున్న ‘జాతిరత్నాలు’ పెద్ద దెబ్బే కొట్టిందని చెప్పాలి. ప్రస్తుతం శ్రీకారం కలెక్షన్లను చూస్తే బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవని సినీ పండితులు అంటున్నారు. ఏదేమైనా శర్వా కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా ‘శ్రీకారం’ మిగలనుంది. శర్వా చేసిన చివరి నాలుగు చిత్రాలను పరిశీలిస్తే అవేవీ కూడా చెత్త సినిమాలు అనడానికి వీల్లేదు. మంచి కథనే ఎంచుకొని అభిరుచి ఉన్న దర్శకులతోనే సినిమాలు చేశాడు. ఆయా సినిమాల ప్రోమోలు కూడా ఆసక్తి రేకెత్తించడంతో శర్వాకు ఈసారి హిట్టు ఖాయం అన్న ఫీలింగే కలిగించింది ప్రతి సినిమా కూడా. కానీ ఏదీ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. మరి తన తదుపరి సినిమాతోనైనా శర్వా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.

Exit mobile version