ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

సోను సూద్…. ఐ యామ్ ఇంప్రెస్డ్

లాక్ డౌన్ వేళ.. దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వలసకార్మికులు అనుభవించిన కష్టాలు అన్ని ఇన్ని కావు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఈ దేశంలోని పేదలకు ఇంతటి దారుణమైన కష్టం రావటమా? అని వేదన చెందిన వారికి కొదవ లేదు. సొంతూరుకు వెళ్లాలన్న పట్టుదలతో మండే ఎండలో వందలాది కిలోమీటర్లు కాలి నడకన వెళ్లిన వైనం కడుపు తరుక్కుపోయేలా చేసింది.

పసిపిల్లలు.. చిన్నారులు.. ఇంటి సామాన్లు మోసుకుంటూ సొంతూళ్లకు పయనమైన వారికి కలిగిన కష్టాలు పగోడికి కూడా రాకూడని పరిస్థితి. వలస కార్మికులు వారి ఊళ్లకు పంపటంలో ప్రభుత్వాలు సైతం కిందామీదా పడిపోతున్న వేళ.. అందుకు భిన్నంగా వ్యవహరించి అందరి నోళ్లలో నానుతున్నారు ప్రముఖ నటుడు సోనూసూద్.

రీల్ విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుపరిచితుడైన సోనూసూద్ వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు వీలుగా చేస్తున్న ఏర్పాట్లు అన్ని ఇన్ని కావు. వారి కోసం ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేయటం దగ్గర నుంచి.. ఆహారం లాంటి ఏర్పాట్లు ఎన్నింటినో ఆయన చేస్తున్నారు. తాజాగా సోనూసూద్ పనితీరును కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లో సోనూ సూద్ స్పందించిన తీరుకు తానెంతో గర్విస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. ఒక నటుడు ఇంత చేసినప్పుడు.. రీల్ లైఫ్ లో హీరోలుగా చెలరేగిపోయే బడా స్టార్లు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేపట్టరు? అన్నదిప్పుడు క్వశ్చన్ గా మారింది. విపత్తు ఎదురైనప్పుడు ప్రభుత్వానికి విరాళాలు ఇవ్వటంతోనే పని పూర్తి అయినట్లు కాకుండా.. ప్రజలకు నిజంగా అవసరమైనవి ఏమిటన్న విషయాల్ని గుర్తించి సాయం చేస్తే మరింత బాగుంటుంది.

Exit mobile version