ఎపుడైతే సినిమా వేగం పెరిగిందో ప్రతీ దానికీ ఒక ప్యాడింగ్ వచ్చి చేరింది. ఇక సినిమా కమర్షియలైజ్ అయ్యాక హీరో అన్న వాడు మరే వేషం వేయకూడదు అని కూడా రూల్ వచ్చేసింది. అది వచ్చేసిందా లేక పెట్టేసుకున్నారా లేక ఫ్యాన్స్ కి ఒట్టేశారా అని చెప్పడం కష్టమే అయినా ఏడుపదులు వచ్చిన హీరో అంటే హీరోవే అని ఇమేజ్ ఉన్న వారు తెర మీద వినోదం పండిస్తున్నారు.
ఇక విలన్ గా వచ్చి హీరో అయి ఆ తరువాత క్యారక్టర్ ఆర్టిస్టు అయిన వారూ ఉన్నారు. మొత్తానికి నటుడు అనిపించుకున్న వారికే ఏ పరిధిలూ పరిమితులూ ఉండవని చెప్పాలి. 2021 టాలీవుడ్ కి ఏమిచ్చింది అంటే ఇద్దరు నటులను విలన్లను చేసే వరం ఇచ్చింది అనుకోవాలి. ఆ ఇద్దరిలో ఒకరు శ్రీకాంత్. నిజానికి శ్రీకాంత్ స్టార్టింగ్ డేస్ లో యువ విలన్ గా బాగా రాణించాడు.
ఆ తరువాత హీరో అయి అమ్మాయిల కలల రాకుమారుడుగా వెలిగాడు. అందగాడు కావడంతో ఆయన ఫ్యాన్ మెయిల్ అలా సాగిపోయింది. ఇక హీరోగా మార్కెట్ తగ్గడంతో సైడ్ క్యారక్టర్ల్లు కూడా శ్రీకాంత్ వేస్తూ వచ్చాడు. ఆయన్ని ఇపుడు అరవీర విలన్ని చేశారు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. బాలయ్య అఖండ మూవీలో శ్రీకాంత్ విలన్ గా బాగానే చేశాడు.
ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా వల్ల బాలయ్య బోయపాటి మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశారు. కానీ విలన్ గా వేసిన శ్రీకాంత్ కి మాత్రం అనుకున్న ఎలివేషన్ అయితే రాలేదు అనే అంటున్నారు. ఈ మూవీలో మెయిన్ విలన్ వరదరాజులుగా శ్రీకాంత్ కంటే స్వామీజీని ప్రకృతిని చూపిస్తూ కధ నడిపారు. దాంతో శ్రీకాంత్ కి ఇచ్చిన సీన్లు కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు అన్న కామెంట్స్ ఉన్నాయి.
ఇక మరో విలన్ మంగళం శ్రీనుగా కమెడియన్ సునీల్ ని తెచ్చి పెట్టారు డైరెక్టర్ సుకుమార్. ఆయన అల్లు అర్జున్ తో చేసిన పుష్ప మూవీలో సునీల్ కి ఇలా టిపికల్ క్యారక్టర్ వెరైటీ డైలాగ్ డెలివరీతో తెర ముందుకు తెచ్చారు. కానీ ఇందులో కూడా సునీల్ మెయిన్ విలన్ కాడు పుష్పకు ఎదురైన అనేక మంది విలన్లలో ఒకడు. దాంతో పాటు సునీల్ లో ఎంతలా రౌద్రం పలికినా జనాలను భయపెట్టలేకపోయింది అన్న టాక్ ఉంది. మొత్తానికి విలన్లుగా భయంకరమైన ఇమేజ్ తో వెలిగిపోవాలనుకున్న ఈ ఇద్దరూ ఎంతవరకూ ఆడియన్స్ ని భయపెట్టారు అంటే జవాబు మాత్రం కాస్తా చేదుగానే ఉంది మరి.