ప్రధానంగా సినిమా థియేటర్లు, లీజులు, చిన్న సినిమా గొడవల సమయంలో ‘ఆ నలుగురి పెత్తనం సినీ పరిశ్రమకు శాపం’ అని అంటుంటారు. అలా అనుకునేవారి విషయంలో తానేమీ మాట్లాడలేననీ, ఎవరి ఇష్టం వారిదని సురేష్‌బాబు తేల్చి చెప్పారు. భవిష్యత్ సినిమా గురించి మాట్లాడుతూ, థియేటర్ల వ్యాపారం ఎక్కువ కాలం మనుగడ సాధించేలా కన్పించడంలేదని చెప్పారాయన.
‘పదేళ్ళు ఈ రంగానికి పెద్దగా ముప్పు వుండదని భావించాం. కానీ, ఇప్పుడు మేలుకోకపోతే, రెండేళ్ళలోనే థియేటర్ల ట్రెండ్ వాష్ ఔట్ అయిపోవచ్చు..’ అని సురేష్‌బాబు చెప్పుకొచ్చారు. ‘ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిస్తే.. కొంతమందికి ఉపాధి దొరుకుతుందేమో.. కానీ, థియేటర్లు వెలవెలబోతే పరిస్థితి ఏంటి.? వివిధ దేశాల్లో లాక్‌డౌన్ ఎత్తేశారు.. అక్కడ సినిమా థియేటర్లు ఎలా వున్నాయి.? అని మనం అధ్యయనం చేయడానికి ఓ అవకాశం దొరికింది. అందుకే తొందరపాటు అనవసరం..’ అని సురేష్‌బాబు చెబుతున్నారు.
‘నారప్ప’ సినిమా విషయానికొస్తే, ఆ సినిమా కోసం కొంత షూటింగ్ చేయాల్సి వుందనీ, రోజుకి 100 మందికి పైగా ఆర్టిస్టులు అవసరమనీ, కేవలం 50 మందితో సినిమా షూటింగ్ చేయాలంటే కుదిరే పని కాదనీ, ఈ నేపథ్యంలోనే కొన్నాళ్ళు సినిమా విషయాన్ని పక్కన పెట్టేశాననీ ఓ ఇంటర్వ్యూలో సురేష్‌బాబు చెప్పుకొచ్చారు. ‘సినిమా మీద ప్యాషన్ వుంటేనే ఈ రంగంలో రాణించగలం. బ్యాక్‌గ్రౌండ్ వున్నా, ప్యాషన్ లేకపోతే రాణించడం కష్టం..’ అని తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేశారు.
ఇక, సినిమాకి సంబంధించి చాలా మార్పులొచ్చాయి. తాను కూడా ఓటీటీ వైపు వెళతానని సురేష్‌బాబు స్పష్టం చేశారు. ‘కథ చెప్పడం ముఖ్యం. దాన్ని వెండితెర మీద చెప్పడమా.? ఓటీటీ మీద చెప్పడమా.? అన్నదే ఇప్పుడు ప్రశ్న. టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిందే. టీవీ రంగం విస్తరించింది.. ఓటీటీ కూడా అంతే..’ అని అంటున్నారు సురేష్‌బాబు.
సినీ పరిశ్రమలో తాజా వివాదాలు కొద్ది రోజుల్లోనే సమసిపోతాయనీ, అలా సమసిపోవడం సినీ పరిశ్రమలో ఎవరికీ ఆశ్చర్యం కాబోదని బాలయ్య వివాదంపై స్పందించారు సురేష్‌బాబు. కొన్నేళ్ళ క్రితం తన సినిమా ‘విశ్వరూపం’ విడుదలకు సంబంధించి వివాదాలు తలెత్తడంతో.. తన సినిమాని డైరెక్టుగా డీటీహెచ్ విధానంలో విడుదల చేయాలనుకున్నారు అప్పట్లో సీనియర్ నటుడు కమల్ హాసన్. ఏమో, భవిష్యత్తులో థియేటర్లు పూర్తిగా కనుమరుగై.. ఇంట్లోనే సినిమా చూడాల్సి వస్తుందేమో.