లాక్‌డౌన్ కారణంగా థియేటర్లలో సినిమాలు విడుదల చేసే పరిస్థితి లేని విషయం తెలిసిందే. దీంతో అమెజాన్‌లో “పోన్ మగల్ వందల్” సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు. దీంతో సినిమా విడుదల అవకాశాన్ని తమకు కాకుండా అమెజాన్‌కు ఇవ్వడంపై కినుక వహించిన యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడు థియేటర్ అండ్ మల్టీప్లెక్స్ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీర్‌సెల్వన్ మీడియాతో మాట్లాడుతూ “పోన్ మగల్ వందల్” సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేస్తున్నారని తెలిసి షాక్‌కు గురయ్యామన్నాడు. ఎప్పుడైనా సరే సినిమాలను మొదట థియేటర్లలో విడుదల చేయాలన్నాడు. ఆ తర్వాత మిగిలిన ప్లాట్‌ఫాంలపై విడుదల చేసుకోవచ్చన్నాడు. నిర్మాతల్ని కలిసి నిర్ణయం మార్చుకోవాలని తాము కోరినప్పటికీ వారు పట్టించుకోలేదన్నాడు. అందుకే భవిష్యత్‌లో ఆ బ్యానర్‌పై తీసే ఏ సినిమాను థియేటర్లలో విడుదల చేసేది లేదని ఆయన స్పష్టం చేశాడు.
దీంతో “పోన్ మగల్ వందల్” సినిమా వ్యవహారం వివాదానికి దారి తీసింది. మున్ముందు థియేటర్ల యజమానులు, సూర్య, దర్శకుడు జేజే ఫ్రెడ్రిక్ మధ్య సినిమా విడుదల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని సూర్య అభిమానులు ఆందోళన చెందుతున్నారు.