బహుశా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మందిని కష్టపెట్టిన సంవత్సరంగా 2020 ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందేమో. కరోనా దెబ్బకు ప్రపంచంలో 80 శాతం మందికి పైగా నష్టాలు చవిచూస్తున్నారు. దీని వల్ల జీవితాలే తలకిందులైపోతున్నాయి. జీవితాలే ఆగిపోతున్నాయి కూడా.
సినీ రంగం ఈ మహమ్మారి ధాటికి ఎంతగా అల్లాడుతుందో చూస్తున్నాం. అది చాలదన్నట్లు వివిధ కారణాలతో ఈ ఏడాది వరుసగా సినీ ప్రముఖులు ప్రాణాలు విడుస్తుండటం అభిమానుల్ని విషాదంలో ముంచెత్తుతోంది.
ఈ ఏడాది చనిపోయిన వాళ్లందరూ హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయిన వాళ్లే. ముందు అలాంటి సంకేతాలేమీ కూడా కనిపించలేదు. క్యాన్సర్‌తో రెండేళ్లుగా పోరాడుతూ.. కొంచెం కోలుకుని ఒక సినిమా కూడా చేసిన ఇర్ఫాన్ ఖాన్ కొన్ని నెలల కిందటే ప్రాణాలు విడిచాడు.
ఆ విషాదం నుంచి తేరుకోక ముందే రిషి కపూర్ కన్నుమూశాడు. ఈ దిగ్గజ నటులకు కనీసం ఘనమైన నివాళి కూడా అందించే అవకాశం లేకుండా చేసింది కరోనా. 20 మందికి మించకుండా సన్నిహితులు వీరి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది.
ఇంతలో పెద్దగా వయసు లేని సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్.. కరోనాతో కన్నుమూశాడు. ఇక దక్షిణాది విషయానికి వస్తే.. కొన్ని రోజుల కిందట అర్జున్ మేనల్లుడు, హీరోయిన్ మేఘనా రాజ్ భర్త అయిన నటుడు చిరంజీవి సర్జా హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూసి కోట్ల మందిని విషాదంలో ముంచెత్తాడు.
ఆ విషాదం మరువకముందే ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడటం పెద్ద షాక్. వీళ్లు కాక మరికొందరు చిన్న స్థాయి సినీ వ్యక్తులు ఈ ఏడాదే చనిపోయారు. ఈ వరుస విషాదాలు చూస్తుంటే 2020 సినిమా వాళ్లపై ఇంతగా కక్ష కట్టిందేంటి.. ఇంకా ఈ ఏడాది ఇలాంటి విషాదాలు ఎన్ని చూడాలో అన్న ఆందోళన నెలకొంటోంది.