ఇదే కోవలో సినీ-టీవీ కార్మికుల సాయం కోసం తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముందుకొచ్చారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న దాదాపు 14 వేల మంది సినీకార్మికుల కుటుంబాలకు తలసాని ట్రస్ట్ ద్వారా నిత్యావసరాల సాయం అందించేందుకు ప్రణాళికను సిద్దం చేశారు. ఈ సేవా కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కానుంది. సినీ, టీవీ కార్మికుల కష్టాలపై తలసాని ఇటీవల సినీపెద్దల సమావేశంలోనూ ఆరా తీసి నిత్యావసరాల్ని సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మహమ్మారీ ప్రభావం ఇతర రంగాలతో పోలిస్తే సినీ రంగంపైనే అధికంగా పడింది. టాలీవుడ్ లో డెయిలీ వేజెస్ కార్మికులకు జీత భత్యాలు లేక అల్లాడుతున్నారు. అవసరం మేర పెద్దల సలహాలు సూచనలు తీసుకుని తనకు తానుగానే ఈ సేవాకార్యక్రమానికి తలసాని ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులను ఇవ్వడానికి శ్రీకారం చుడుతున్నారు. గురువారం మొదలు నిత్యం 14 వేల మంది సినీ కార్మికుల కుటుంబాలకు అందే వరకు ఈ సేవా కార్యక్రమం కొనసాగనుందని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.