ఇలాంటి గ్యాసిప్ లు అనేకం టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. కానీ ఒకటే అనుమానం. నిజంగా టాలీవుడ్ ఆర్జీవీ మీద కోపంగా వుందా? అన్నదే. ఎందుకంటే నిజంగా టాలీవుడ్ కోపంగా వుంటే, ఆర్జీవీ మీద ట్వీట్ల వర్షం కురవాలి. త్రివిక్రమ్ లాంటి గౌరవనీయమైన దర్శకుడిని కొట్టినట్లు సీన్ సృష్టించినందుకు మిగిలిన దర్శకులంతా విరుచుకుపడాలి.
కానీ టాలీవుడ్ దర్శకుల్లో ఆర్జీవీ ఆరాధకులు, ఆర్జీవీ ప్రేమికులు, ఆర్జీవీ అనుచరులం అని చెప్పుకోవడానికి ఇష్టపడేవారే ఎక్కువ. ఇప్పుడు పవర్ స్టార్ సినిమా నేపథ్యంలో ఎవ్వరూ బయటకు రావడం లేదు కానీ, గతంలో ఆర్జీవీ ఏ హడావుడి చేసినా, ఈ బ్యాచ్ బ్యాచ్ అంతా బొలోమంటూ వచ్చేది.
ఇక టాలీవుడ్ చాంబర్ వ్యవహారం కూడా అలాగే వుంది. కవి, రచయిత జొన్నవిత్తుల ఆర్ జి వి టైటిల్ కావాలని దరఖాస్తు చేస్తే వెంటనే తిరస్కరించేసారు. ఇవ్వలేం అని చేతులు ఎత్తేసారు. ఆర్ జి వి అనేది జస్ట్ ఓ పేరు. అదేమీ మనోభావాలు దెబ్బతీస్తుంది అనే వాదనలు వచ్చేది కాదు. ఆ లెక్కన యుగంధర్, అశోక్, బాబీ, జస్టిస్ చౌదరి ఇలాంటి టైటిళ్లు వేటికీ అనుమతి ఇవ్వకూడదు. మరి ఛాంబర్ ఎందుకు ఆర్ జి వి టైటిల్ ఇవ్వడానికి జొన్నవిత్తుల కు, నిర్మాత బొగ్గారం శ్రీనివాసరావుకు నో చెప్పింది?
టాలీవుడ్ సెలబ్రిటీ మీద ఇలాంటి సినిమా తీస్తున్నారని, ఆర్జీవీని బాయ్ కాట్ చేస్తున్నాం అని దర్శకుల సంఘం తీర్మానం చేసే అవకాశం ఏమన్నా వుందా?
టాలీవుడ్ ప్రముఖుల మీద ఇలాంటి సినిమా తీస్తున్నారని ఆయనకు టాలీవడ్ 24 క్రాఫ్ట్ ల వారు ఎవ్వరూ సహకరించకూడదని ఛాంబర్ తీర్మానించే అవకాశం వుందా?
ఇలా ప్రశ్నించుకుంటే, సమాధానాలు నో అనే వస్తాయి. అందులో సందేహం లేదు. భవిష్యత్ లో బాలకృష్ణ మీద కూడా ఆర్జీవీ సినిమా తీస్తారు అని గ్యాసిప్ లు గట్టిగా వినిపిస్తున్నాయి. అప్పుడు కూడా టాలీవుడ్ ఇదే తరహా మౌనం పాటిస్తుందా?
అసలు ఆర్జీవీ నోటికి, ట్వీట్లకు టాలీవుడ్ జనాలు భయపడుతున్నారా? ఆయన తాను పవన్ కళ్యాణ్ సినిమా తీయడం లేదని చెబుతూనే ఆయనను పోలిన హీరోను పెట్టి, సినిమా సెలబ్రిటలను పోలిన నటులను పెట్టి, ఓపెన్ గా అబద్దాలు పేర్చి సినిమా తీస్తుంటే టాలీవుడ్ ఎందుకు మౌనంగా వుంటోంది. సహిస్తోంది? ఇది జవాబు తెలియని ప్రశ్న.