ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

హీరోలు త్యాగం చేయకుంటే మునిగినట్లే

కరోనా మహమ్మారి ధాటికి ఇండియాలో ఓవరాల్‌గా ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉంటుందో కానీ.. దీని వల్ల వివిధ రంగాలకు జరిగే ఆర్థిక నష్టం మాత్రం అంచనా వేయలేని స్థాయిలో ఉంటోంది. ఈ దెబ్బ నుంచి అంత సులువుగా కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. కరోనా తగ్గుముఖం పట్టినా.. సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. కొన్నేళ్ల పాటు ఈ ప్రభావం కొనసాగేలా ఉంది.

కొన్ని నెలల పాటు సినిమాల ప్రదర్శన, షూటింగ్ ఆగిపోతుండటంతో నిర్మాతలు కుదేలైపోతున్నారు. ఆల్రెడీ విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. మేకింగ్ దశలో ఉన్న సినిమాల బడ్జెట్లూ పెరిగిపోతున్నాయి. మరోవైపు కరోనా అనంతర పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు.

జనాల్ని థియేటర్లకు రప్పించడం అంత తేలిక కాదని అర్థమవుతోంది. కొన్ని నెలల పాటు రెవెన్యూ నామమాత్రంగా ఉండబోతోంది. సినిమా థియేట్రికల్ బిజినెస్‌ మీద చాలా ప్రభావం పడేలా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో బడ్జెట్లు తగ్గించకపోతే నిర్మాతల మనుగడే ప్రశ్నార్థకం అయ్యేలా కనిపిస్తోంది. బడ్జెట్లు తగ్గించడం అనేది ఆర్టిస్టులు.. ముఖ్యంగా హీరోల పారితోషకం తగ్గించడం మీదే ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం టాలీవుడ్లో పెద్ద స్టార్ హీరోల సినిమాల బడ్జెట్లు రూ.100 కోట్ల మార్కును అందుకుంటుండటానికి ప్రధాన కారణం.. హీరోలకు అయినకాడికి పారితోషకం ఇస్తుండటమే.

తమకున్న డిమాండ్ దృష్ట్యా ఎవరెక్కువ పారితోషకం ఇస్తే వాళ్లకే సినిమాలు చేస్తున్నారు హీరోలు. చివరికి సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వారి పారితోషకాలు పెరిగిపోతున్నాయి. పారితోషకంతో పాటు వాటాలు తీసుకోవడం, డేట్లను అమ్ముకోవడం కూడా చేస్తున్నారు.

ఐతే ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో హీరోలు ఇలాంటివి కట్టిపెట్టి కొంచెం త్యాగాలు చేయాల్సిందే అని.. వాళ్లు పారితోషకాలు తగ్గించుకుంటే, పాత ఒప్పందాల్ని రివైజ్ చేసుకుంటే తప్ప తాము కోలుకోలేమని నిర్మాతలు అంటున్నారు. ఇప్పటికే విడుదలకు సిద్ధమైన సినిమాలు బయటికి రావాలన్నా.. వాటి వల్ల తాము నష్టాల్లో కూరుకుపోకుండా ఉండాలన్నా.. హీరోలు కొంత మొత్తం పారితోషకం వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందని కూడా నిర్మాతల్లో చర్చ నడుస్తున్నట్లు సమాచారం.

Exit mobile version