ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

త్రివిక్రమ్ సినిమా రీమేకా.. ప్చ్

టాలీవుడ్ టాప్ రేటెడ్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకడు. దశాబ్దంన్నర కిందట్నుంచి ఆయన సినిమాలు తీస్తున్నారు. దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన కొంత కాలానికే స్టార్ డైరెక్టర్ అయిపోయారు. రెండో సినిమాకే మహేష్ బాబును డైరెక్ట్ చేశాడు. ఆయన సక్సెస్ రేట్ ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు, క్లాసిక్‌లు డెలివర్ చేశాడు. రచయితగా కూడా త్రివిక్రమ్‌ నుంచి సూపర్ హిట్లు వచ్చాయి.

కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. త్రివిక్రమ్ సినిమాల్ని వేరే భాషల్లో తీస్తే మాత్రం ఆశించిన ఫలితాలు ఎప్పుడూ దక్కలేదు. రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ బిగ్గెస్ట్ హిట్టయిన ‘నువ్వు నాకు నచ్చావ్’ను తమిళంలో విజయ్ హీరోగా ‘వశీకర’ పేరుతో రీమేక్ చేస్తే అది డిజాస్టర్ అయింది. అలాగే రైటర్ గా త్రివిక్రమ్ బెస్ట్ వర్క్స్‌లో ఒకటనదగ్గ ‘చిరునవ్వుతో’ను విజయ్ హీరోగానే తమిళంలో ‘యూత్’ పేరుతో రీమేక్ చేస్తే అంతగా ఆడలేదు.

ఇక దర్శకుడిగా ‘అల వైకుంఠపురములో’ కంటే ముందు ‌ త్రివిక్రమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ‘అత్తారింటికి దారేది’ని తమిళంలో గత ఏడాదే ‘వందా రాజాదా వరువేన్’ పేరుతో శింబు హీరోగా రీమేక్ చేస్తే అది కూడా డిజాస్టరే అయింది. ఇంకా ‘అతడు’ సినిమాను ‘ఏక్’ పేరుతో హిందీలో తీస్తే అదీ ఆడలేదు.

ఇందుకు కారణాలేంటన్నది పరిశీలిస్తే.. త్రివిక్రమ్ కథా కథనాల కంటే కూడా ఆయన మాటలు, చమత్కారం ఆయా సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. నేటివ్ హ్యూమర్‌తో తన సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దుతుంటాడు త్రివిక్రమ్. హీరోలు కూడా ఆయనకు తగ్గట్లుగా ట్యూన్ అయి ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో వినోదం పండిస్తారు.

ఈ సినిమాలు వేరే భాషల్లోకి వెళ్లినపుడు ఇలా వినోదం పండకపోవడంతో సాధారణంగా అనిపించి అవి తేలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాకు రీమేక్ అనేసరికి వేరే భాషల వాళ్లు రిస్క్ చేస్తున్నట్లే అనిపిస్తోంది. హిందీతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను తీస్తారట. తమిళంలో శివకార్తికేయన్ హీరోగా రీమేక్ చేస్తారంటున్నారు. మరి ఈసారైనా త్రివిక్రమ్ సినిమా వేరే భాషలో ఆడుతుందో లేదో చూడాలి.

Exit mobile version