టీటీడీ ఆస్తుల్ని అమ్మాలన్న తమ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతున్న కొన్ని మీడియాసంస్థలు.. నిజాల్ని ఎందుకు చెప్పటం లేదన్నది ఆయన ప్రశ్న. విషయం ఏదైనా కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడే తీరున్న సుబ్బారెడ్డి.. తాజాగా చెప్పిన విషయాల్ని వింటే విస్మయానికి గురి కాక తప్పదు.
టీటీడీకి ఉన్న ఆస్తుల్ని అమ్మే ప్రక్రియ 1974 నుంచి సాగుతుందన్నారు. 2014 వరకు మొత్తం 129 ఆస్తుల్ని బహిరంగ వేలం ద్వారా అమ్మినట్లు చెప్పారు. గతంలోనే స్వామివారి ఆస్తుల్ని అమ్మినప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు అన్నది ఆయన ప్రశ్న. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల్ని పరిరక్షించటం కష్టంగా ఉందంటున్నారు.
రుషికేశ్ లో ఎకరా 20 సెంట్ల భూమితో టీటీడీకి ఎలాంటి ప్రయోజనం లేదని.. ఆ ఆస్తి దురాక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళనను వ్యక్తం చేశారు.
టీటీడీ ఆస్తులు ఎవరికో అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు వీలుగానే అమ్మకాల్ని చేపట్టాలన్నది వైవీ సుబ్బారెడ్డి వాదన. గత ప్రభుత్వ హయాంలో చేసిన తీర్మానాల్ని మర్చిపోకూడదని చెబుతున్న వాదనలోనూ అర్థముందని చెప్పక తప్పదు. ఇదంతా చూసినప్పుడు శ్రీవారికి చెందిన నిరర్థక ఆస్తుల విషయంలో గత ప్రభుత్వాలకు లేని అభ్యంతరమంతా ఇప్పుడే ఎందుకన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకరు చేస్తే ఒప్పు.. మరొకరు చేస్తే తప్పు అయిపోతుందా?