రెండేళ్ల కిందట వచ్చిన బ్లఫ్ మాస్టర్ సత్యదేవ్ కెరీర్‌ను మలుపు తిప్పుతుందనుకున్నారు కానీ.. అది కూడా ఆశించినట్లు ఆడలేదు. ఇక ఈ మధ్యే డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన 47 డేస్ కూడా నిరాశకే గురి చేసింది. ఇక అతడి ఆశలన్నీ ఉమామహేశ్వరరావు ఉగ్రరూపస్య మీదే నిలిచాయి.
పెద్దగా ప్రచారం లేకుండా ఈ నెల 30న ఉన్నట్లుండి నెట్ ఫ్లిక్స్‌లో రిలీజైందీ చిత్రం. మరీ పాజిటివ్ రివ్యూలు రాకున్నా.. మోడరేట్ రివ్యూలతోనే ఈ సినిమా మంచి స్పందనే తెచ్చుకుంటున్నట్లుంది. నెట్ ఫ్లిక్స్‌లో టాప్-5లో ట్రెండ్ అవుతోందీ చిత్రం. వ్యూస్ బాగానే వస్తున్నాయి. ట్విట్టర్లో ఈ సినిమా గురించి బాగానే చర్చ నడుస్తోంది. చాలామంది నెటిజన్లు ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. రెఫర్ చేస్తున్నారు.
ఇక సత్యదేవ్ పెర్ఫామెన్స్ గురించైతే అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ పాత్రను అతను పండించిన విధానాన్ని కొనియాడుతున్నారు. సత్యదేవ్ లుక్ పట్ల కూడా సానుకూల స్పందన కనిపిస్తోంది. థియేటర్లలో అయితే వసూళ్లను బట్టి సినిమా ఫలితాన్ని అంచనా వేయొచ్చు కానీ.. ఓటీటీ రిలీజ్‌ల విషయంలో సోషల్ మీడియా రెస్పాన్స్‌ను బట్టే అంచనా వేయాలి. దాని ప్రకారం చూస్తే సత్యదేవ్ సోలో హీరోగా తొలి హిట్టు కొట్టినట్లే ఉన్నాడు.