ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

వాలంటీర్లు అత్యాచారాలు చేస్తుంటే సీఎంకు పట్టదా: వంగలపూడి అనిత


వాలంటీర్లు మహిళలపై అత్యాచారాలు చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమని తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. జూమ్ యాప్ ద్వారా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నమట్లగొంది గ్రామంలో వలంటీరుగా పనిచేస్తున్న సంతోశ్ ఓ బాలికపై అత్యాచారం చేసిన ఘటనను ఆమె ఉదహరించారు. వలంటీర్లు అత్యాచారాలకు పాల్పడుతున్నా వారిపై దిశ చట్టం ఎందుకు పెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 400 వరకూ అత్యాచార ఘటనలు జరిగాయని దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని అన్నారు. వలంటీర్లలో 90శాతం వైసీపీ కార్యకర్తలే ఉన్నారని ఆమె ఆరోపించారు. సీఎం జగన్ వారిపై చర్యలు తీసుకోకపోవటానికి ఇదే కారణమని అన్నారు. వారంతా ప్రభుత్వ ఉద్యోగులో.. వైసీపీ కార్యకర్తలో సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వారికి ప్రభుత్వం నుంచి ఎలా గౌరవ వేతనం ఇస్తారని ప్రశ్నించారు.

ఇంతటి దారుణాలు జరుగుతున్నా మహిళా కమిషన్ స్పందించటం లేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా మహిళల రక్షణ కోసం ఉద్యమించి ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్న వాసిరెడ్డి పద్మ ఏం చేస్తున్నారని నిలదీశారు. బాధిత బాలికకు ఏం అండగా నిలబడ్డారని ఆమె ప్రశ్నించారు. దిశ చట్టం తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకున్నా ఏ ఒక్కరికీ న్యాయం జరగట్లేదని అన్నారు. రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఉన్నారని సంతోషిస్తున్నా ఆమె ఓ కీలుబొమ్మలా మారిపోవడం బాధాకరమన్నారు.

Exit mobile version