ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

‘గీతం’పై మరో పిడుగు: ఎన్‌ఎంసికి విజయసాయిరెడ్డి ఫిర్యాదు

ఫేక్‌ డాక్యుమెంట్లతో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకి తప్పుడు సమాచారం ఇచ్చిందంటూ ‘గీతం’ సంస్థపై నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌కి ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఎన్‌ఎంసికి ఓ లేఖ రాశారు. ఆ లేఖలో, గీతం సంస్థ భూ ఆక్రమణలకు పాల్పడిందనీ, ఈ క్రమంలో ఫేక్‌ డాక్యుమెంట్లను సృష్టించి, వాటి ద్వారా గీతం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌ కోసం అనుమతులు పొందిందని ఆరోపించారు విజయసాయిరెడ్డి.

తక్షణం ఈ అక్రమాలపై విచారణ జరపాలంటూ లేఖలో విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. గీతం సంస్థ అక్రమంగా ఆక్రమించిన భూమి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందినదని లేఖలో ప్రస్తావించారు విజయసాయిరెడ్డి. గీతం సంస్థ భూ ఆక్రమణలకు సంబంధించి గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో పొలిటికల్‌ యాగీ జరుగుతోన్న విషయం విదితమే. అధికారులు, సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని గుర్తించి, కొన్ని నిర్మాణాల్ని కూల్చేశారు. కాగా, గీతం సంస్థ ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించడంతో, కూల్చివేతలపై హైకోర్టు ఈ నెల 30వ తేదీ వరకు స్టే విధించింది.

గీతం సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, శాశ్వత నిర్మాణాల్ని కూల్చొద్దని మాత్రమే హైకోర్టు చెప్పిందని వైసీపీ అంటోంది. ఇదిలా వుంటే, తెలుగుదేశం పార్టీ ఈ ‘గీతం’ వివాదంపై పెద్దయెత్తున ఆందోళనలు చేపడుతోంది. గీతం సంస్థ టీడీపీ నేత భరత్‌కి చెందినది కావడంతో టీడీపీ అత్యుత్సాహం సుస్పష్టం.

అదే సమయంలో, టీడీపీ నేతకు చెందిన సంస్థ కావడంతోనే ప్రభుత్వ పెద్దలు కుట్రపూరిత చర్యలకు తెరలేపారనీ ఆరోపిస్తున్నారు టీడీపీలు. ఇంతకీ గీతం సంస్థ ఆక్రమణలకు పాల్పడిందా.? లేదా.? వ్యవహారం కోర్టులో వుంది గనుక, కోర్టు తేల్చాల్సిన వ్యవహారమిది. మరి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుంది.? ప్రస్తుతానికి ఇది కూడా సస్పెన్సే.

Exit mobile version