ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

MAA భవంతికి స్థలం చూశాడు! నాగబాబు సవాల్ కి విష్ణు ధీటైన జవాబు!!


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రాజకీయాలు MAA శాశ్వత భవనం చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు సహా పలువురు మా సొంత భవంతి నిర్మాణంపైనే టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. అధ్యక్షుడిగా గెలిపిస్తే ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరిస్తామని వీరంతా ప్రకటనలు చేశారు.

కలెక్షన్ కింగ్ వారసుడు మంచు విష్ణు శాశ్వత భవంతి నిర్మాణం కోసం తన సొంత డబ్బును వెచ్చిస్తానని ఎవరూ రూపాయి కూడా పెట్టాల్సిన పనే లేదని ప్రకటించడం సంచలనమే అయ్యింది. విష్ణు ఈ ప్రకటన చేసి చాలా కాలమే అయ్యింది. ఆ ప్రతిజ్ఞను అతడు నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నాడా? లేడా? సెప్టెంబర్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీనినే అతడు ఎజెండాగా ప్రకటిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది.

తాజాగా తన సోషల్ మీడియాలో విష్ణు ఒక వీడియోను పోస్ట్ చేసారు. దీనిలో MAA శాశ్వత భవనానికి సముచితంగా సరిపోయే మూడు సైట్లను కనుగొన్నానని వాటి నుంచి ఒకటి అందరం కలిసి ఎంపిక చేద్దామని ప్రకటించి షాకిచ్చాడు. ఆ వీడియోలో విష్ణు మాట్లాడుతూ-“ MAA కుటుంబానికి శుభోదయం.. మా అసోసియేషన్ శాశ్వత ఆఫీస్ ని కలిగి ఉండటం మనందరి కల. నేను వ్యక్తిగతంగా మూడు స్థలాలను సందర్శించాను. ఆ విషయాన్ని అందరితో పంచుకోవాలనుకున్నాను. మనమంతా ఆ మూడింటి నుంచి బెస్ట్ స్థలాన్ని ఎంపిక చేసుకుందాం“ అని ప్రకటించారు.

చూస్తుంటే మంచు విష్ణు ప్రతిదీ ఛాలెంజింగ్ గానే తీసుకున్నారని అర్థమవుతోంది. ఇంతకుముందు మెగా బ్రదర్ నాగబాబు విసిరిన సవాల్ ని అతడు పక్కాగా స్వీకరించాడు. MAA శాశ్వత భవనం కోసం విష్ణు కొంత సీరియస్ గానే దృష్టి పెట్టి పని చేస్తున్నారని అర్థమవుతోంది. MAA ఎన్నికల రేసులో అతడు దూసుకుపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇంతకుముందు ప్రకాష్ రాజ్ ని సమర్థిస్తూ .. మా సొంత భవంతికి మంచు విష్ణు డబ్బు సర్ధినా కానీ స్థలం ఎలా తెస్తాడో చెప్పాలని నాగబాబు సవాల్ విసిరారు. దానికి సమాధానంగానే విష్ణు ఇలా కసరత్తు చేశారని అర్థమవుతోంది. అతడి పనితీరు నిజాయితీకి మా ఎన్నికల్లో ఓట్లు పడతాయనే భావించాలి.

బండ్ల గణేష్ అసలు భవనమే వద్దన్నారు కదా!

మూవీ ఆర్టిస్టుల సంఘం(మా) ఎన్నికల్లో సొంత భవంతి నిర్మాణమే ప్రధాన ఎజెండాగా పలువురు సభ్యులు పోటీబరిలో దిగుతున్న వేళ అసలు సొంత భవంతి అవసరమే లేదని బండ్ల గణేష్ అన్నారు. దానికంటే పేద ఆర్టిస్టులకు సొంత ఇల్లు కట్టివ్వాలని గణేష్ కోరారు. తాను శాశ్వత భవంతి నిర్మాణానికి వ్యతిరేకినని.. ఈ సంక్లిష్ట సమయంలో మంచి సంక్షేమ కార్యక్రమాలు చాలా అవసరమని బండ్ల అన్నారు.

ఈసారి పోటీబరిలో ప్రకాష్ రాజ్ .. విష్ణు దూకుడుమీదుండగా.. జీవిత రాజశేఖర్- హేమ- సీవీఎల్ వంటి వారు ఈ పోటీలో ఉన్నారు. ప్రకాష్ రాజ్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎకరం భూమి ఇవ్వాల్సిందిగా కోరతానని అన్నారు. అలాగే మంచు విష్ణు మా భవంతి నిర్మాణానికి అవసరమయ్యే మొత్తం డబ్బు తానే సమకూరుస్తానని ఎవరూ ఇవ్వాల్సిన పనే లేదని శపథం చేశారు. ఇప్పుడు మంచు విష్ణు స్థలం వెతికేశారు కాబట్టి ఇక ప్రకాష్ రాజ్ వెళ్లి తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించాల్సిన అవసరం లేకపోవచ్చు. నాగబాబు ఛాలెంజ్ ని స్వీకరించి విష్ణు స్థల సేకరణ చేసినందుకు ఇప్పుడు అతడు భవంతి నిర్మాణానికి అయ్యే డబ్బును కూడా పెట్టే ఛాన్సుంటుంది. అటుపై ఇల్లు లేని `మా` పేద ఆర్టిస్టుల ఇంటి నిర్మాణానికి ప్రకాష్ రాజ్ సహ పలువురు సినీపెద్దలు సాయం చేస్తే బావుంటుందేమో!

Exit mobile version