విశాఖలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి ప్రమాదకర వాయువులు లీకవడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. అస్వస్థతకు గురయినవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, వారిలో రోజుకో కొత్త సమస్య బయటపడ్తోంది. ఒళ్ళు బొబ్బలెక్కి తమకు ఏం జరుగుతుందో తెలియక బాధితులు నానా పాట్లూ పడుతున్నారు.
‘జగనన్న సాయం కోటి రూపాయలు..’ అంటూ శవాల మీద పేలాలు ఏరుకున్నట్లుగా వైసీపీ నేతలు పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు. ‘వాళ్ళకి ఇరవై లక్షలే ఎక్కువ.. మా జగనన్న కాబట్టి కోటి రూపాయలు ఇచ్చారు..’ అని సాక్షాత్తూ మంత్రిగారే మీడియా ముఖంగా సెలవిచ్చారంటే, ప్రజల ప్రాణాలు ప్రభుత్వంలో వున్నవారికి ఎంత చులకన.? అన్న విషయం అర్థమవుతోంది.
‘పుండు మీద కారం చల్లినట్లుగా’ అధికార పార్టీ నేతల ప్రకటనలు కన్పిస్తుండడంతో బాధితుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ‘మేమంతా డబ్బు పోగేసుకుని, రెండు కోట్లు ఇస్తాం.. పోయిన ప్రాణాలు తీసుకొస్తారా.?’ అని బాధితులు నిలదీస్తున్నారు. మరోపక్క, సోషల్ మీడియా వేదికగా ఎల్జీ పాలిమర్స్‌కీ, అధికార పార్టీ నేతలకీ వున్న లింకుల్ని విపక్షాలు బయటపెడ్తున్నాయి.
లాక్‌డౌన్ అమల్లో వున్నా, ఎల్జీ పాలిమర్స్‌లో ఎందుకు పనులు జరుగుతున్నాయంటూ జనం ప్రశ్నిస్తోంటే, ఆ ప్రశ్నకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి సమాధానం దొరకడంలేదు. చెట్లు మాడిపోయాయ్.. పశువులు ప్రాణాలు కోల్పోయాయ్.. తాము నివసిస్తున్న ప్రాంతమంతా విషతుల్యమైపోయిందని ప్రజలు ఆందోళన చెందుతున్న వేళ ‘ఆల్ ఈజ్ వెల్..’ అంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతుండడంలో ఆంతర్యమేమిటో మరి.!