ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కరోనా విరాళాలు: చిరంజీవి సార్.. చిరంజీవి అంతే

కరోనా వైరస్ ధాటికి మొత్తం వ్యవస్థలన్నీ లాక్ డౌన్ అయిపోవడంతో ఆయా రంగాలకు చెందిన కింది స్థాయి కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. సినీ పరిశ్రమ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఐతే దేశంలో మిగతా ఇండస్ట్రీల స్టార్లతో పోలిస్తే టాలీవుడ్ తారలు చాలా ముందే పరిస్థితి తీవ్రతను గుర్తించారు.

సినీ కార్మికుల కోసం పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. మెగాస్టార్ చిరంజీవి సంబంధిత సేవా కార్యక్రమాల్ని ముందుండి నడిపిస్తున్నారు. ఇప్పటిదాకా టాలీవుడ్ కార్మికుల కోసం రూ.7 కోట్లకు పైగానే విరాళాలు సమకూరినట్లు తెలుస్తోంది. మరి ఈ మొత్తంతో చిరు అండ్ కో ఏం చేస్తోంది.. కార్మికుల్ని ఎలా ఆదుకుంటోంది అన్నది వెల్లడి కాలేదు. దీనిపై చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇచ్చిన సలహాల మేరకు కార్మికులకు తోడ్పాటు అందిస్తున్నట్లు చిరు వెల్లడించారు.

ముందుగా సాయం కావాల్సిన కార్మికులందరూ ఫిలిం ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష్, ఇతర గుర్తింపు పొందిన సినీ సంస్థల వద్ద నమోదు చేసుకోవాలని చెబుతున్నారు. అలా అన్ని సంస్థల నుంచి కార్మికుల వివరాలు సేకరించి.. వారికి ఎలక్ట్రానికి గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. ఈ పని మీద నలుగురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు పని చేస్తున్నారు.

ఈ ఎలక్ట్రానిక్ గుర్తింపు కార్డుల్ని కార్మికులకు అందజేసి.. వారికి ఈ నెలకు గాను 2250 రూపాయల విలువైన నిత్యావసర సరకులు అందజేయనున్నారు. దీంతో పాటు కొంత ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు. ఈ కార్డుల్ని మొబైల్ నంబర్‌తో అనుసంధానం చేయడం ద్వారా సాయం అందిన వారు అక్నాలడ్జ్ చేసేలా ఓటీపీ పంపుతున్నారు. తద్వారా ప్రతి ఒక్క కార్మికుడికీ సాయం అందుతోందా లేదా అన్నది పర్యవేక్షణ చేస్తున్నారు.

లాక్ డౌన్ పొడిగిస్తే మరో నెల కూడా ఇలాగే సాయం అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ ఎలక్ట్రానిక్ కార్డు తీసుకుని ప్రిస్కిప్షన్ పట్టుకుని వెళ్తే అపోలో మందుల దుకాణాల్లో రూ.500 మొత్తానికి ఉచితంగా మందులు అందించేలా చిరు కోడలు ఉపాసన ఏర్పాట్లు చేయడం విశేషం.

Exit mobile version