ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఉద్యోగాలు తీసెయ్యొద్దన్న కేటీఆర్‌.. మాట వింటారా.?

తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్రత అధికంగానే వుంది. అయినా, ఇక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న బాధ్యతాయుతమైన చర్యల నేపథ్యంలో పరిస్థితి అదుపులోనే వుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పదే పదే మీడియా ముందుకు వస్తున్నారు, ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఓ వైపు గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితిని పరిశీలిస్తూనే, సోషల్‌ మీడియా వేదికగా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నారు మంత్రి కేటీఆర్‌.

తాజాగా కేటీఆర్‌, హైద్రాబాద్‌లో ఐటీ సంస్థల్ని ఉద్దేశించి ఓ ‘సూచన’ చేశారు. కరోనా పరిస్థితుల్ని సాకుగా చూపి ఉద్యోగుల్ని తొలగించవద్దనీ, జీతాల చెల్లింపు ఆలస్యం చేయొద్దని కేటీఆర్‌ విజ్ఞప్తి చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు కేటీఆర్‌. ఈ ప్రకటనకు సానుకూల స్పందనే వస్తోంది. అయితే, అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో ఐటీ సంస్థలు గత కొంత కాలంగా ‘వేటు’ వ్యవహారాల్ని నడిపేస్తున్నాయి.

ఇప్పుడు కరోనా ‘సాకు’ దొరకడంతో మరింతగా ఈ ‘వేటు’ వ్యవహారాలు నడుస్తుండడం గమనార్హం. పలువురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో జీతాల చెల్లింపు కూడా కొన్ని సంస్థలు చేయని పరిస్థితి కన్పిస్తోంది. ఐటీ సంస్థల్ని ప్రభుత్వాలు ఆదేశించలేవుగానీ, ప్రభుత్వ సూచనలు కొంతమేర సానుకూల పరిణామాలకు కారణమయ్యే అవకాశముంటుంది.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐటీ సంస్థలకు కొన్ని వెసులుబాట్లు ప్రభుత్వాలు కల్పిస్తే మంచిదన్న చర్చ ఐటీ వర్గాల్లో విన్పిస్తోంది. కాగా, ఐటీ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వాల నుంచి పెద్దయెత్తున రాయితీలు పొందాయనీ, ఈ తరుణంలో ప్రభుత్వాల విజ్ఞప్తుల్ని పరిగణనలోకి తీసుకుని ‘కార్పొరేట్‌ రెస్పాన్సిబిలిటీ’ని చాటుకోవాలన్నది మరికొందరి వాదన. ఏదిఏమైనా, కష్ట కాలంలో ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే.. సమాజం మళ్ళీ కుదురుకోవడానికి సాధ్యపడుతుంది.

Exit mobile version