ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ప్రపంచ బిలియనీర్లలో ఎవరెంత ఇచ్చారు?

కరోనాతో ప్రపంచం మొత్తం అల్లాడిపోతోంది. ఇంతలా ప్రపంచం మొత్తాన్ని కల్లోలానికి గురి చేసిన మరో జబ్బు ఉందా అంటే సందేహమే. వందల కోట్ల మంది ఉపాధి కోల్పోయాయి. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరెన్నో లక్షల మంది అస్వస్థతతో బాధ పడుతున్నారు. ఆర్థిక వ్యవస్థలు చిన్నా భిన్నమై ఆకలి కేకలకు దారి తీసే పరిస్థితి నెలకొంది. ఈ సంక్షోభ సమయంలో అభాగ్యులను ఆదుకునేందుకు ప్రపంచ బిలియనీర్లు చాలామంది ముందుకొచ్చారు. వందలు, వేల కోట్ల రూపాయల్ని వితరణ చేశారు.

అందరిలోకి ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ భూరి విరాళంతో ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అతను తన సంపదలో సగానికి సగం కరోనాపై పోరు కోసం కేటాయించాడు. ఆ మొత్తం బిలియన్ డాలర్లు కావడం విశేషం. అంటే.. మన రూపాయల్లో అయితే రూ.7600 కోట్ల దాకా అన్నమాట. ఈ మొత్తంతో తన ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు డార్సీ.

ఇక మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేర్లు ఒకడైన బిల్ గేట్స్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. భార్యతో కలిసి ఆయన 255 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించాడు. రూపాయ ల్లో చెప్పాలంటే ఆయన విరాళం దాదాపు రూ.2 వేల కోట్లు. ఆ తర్వాతి స్థానంలో నిలిచేది మన రతన్ టాటా. తన గ్రూప్‌తో కలిసి ఆయన రూ.1500 కోట్ల విరాళం అందజేశాడు.

మరో భారత కుబేరుడు అజీజ్ ప్రేమ్‌జీ రూ.1000 కోట్ల దాకా విరాళం అందజేశాడు. ఇక ప్రముఖ అమెరికన్ ఇన్వెస్టర్ జార్జ్ సొరాస్ కూడా ప్రేమ్ జీకి దీటుగా రూ.990 కోట్ల దాకా విరాళం అందజేశాడు. ఆస్ట్రేలియన్ వ్యాపారవేత్త ఆండ్రూ ఫారెస్ట్ 100 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు 760 కోట్లు అందజేశాడు. అమెరికాకు చెందిన కుబేరులు జెఫ్ స్కాల్, జెఫ్ బిజోస్, మైకేల్ డెల్ కూడా తలో వంద మిలియన్ డాలర్లతో తమ ఉదారతను చాటుకున్నారు. సామాజిక బాధ్యతను మరిచిపోకుండా భూరి విరాళాలు ప్రకటించిన ఈ కుబేరులందరినీ ప్రపంచం కీర్తిస్తోంది.

Exit mobile version