ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

వైసీపీకి దక్కని పబ్లిసిటీ: చంద్రబాబు ఖాతాలోకి ‘టిడ్కో’.!

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రానికి లక్షల సంఖ్యలో ఇళ్ళను ఇచ్చిందంటూ బీజేపీ ఇప్పటికీ చెబుతుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణలోనూ బీజేపీ వాదన ఇదే. తెలంగాణ సంగతి పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్ళ నిర్మాణం పెద్దయెత్తున జరిగింది. సరే, ఆ ఇళ్ళ నిర్మాణంలో టీడీపీ అక్రమాలనేది వేరే సబ్జెక్ట్‌. కట్టేసి వున్న ఇళ్ళను పేదలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా.! ‘మేమే కట్టాం..’ అని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటుంటారుగానీ, ఆ ఇళ్ళను లబ్దిదారులకు అప్పట్లో ఎందుకు అందించలేదు.? అన్న ప్రశ్నకు టీడీపీ దగ్గర ఇప్పటికీ సమాధానం వుండదు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక, దాదాపు 20 నెలల తర్వాత ఆ టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు అందించే ప్రక్రియ చేపట్టారు. ఆయా భవనాలకు ‘బులుగు’ రంగులేసింది వైసీపీ ప్రభుత్వం. అయినాగానీ, లబ్దిదారులు మాత్రం ‘చంద్రన్న ఇచ్చిన ఇళ్ళు..’ అంటూ వైసీపీ నేతలకు తెగేసి చెబుతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఎదురవుతుండడంతో, వైసీపీ నేతలకు మైండ్‌ బ్లాంక్‌ అయిపోతోంది. నిజమే, వైసీపీ అధికారంలోకి వచ్చాక.. కొత్తగా పేదలకు కట్టి ఇచ్చిన ఇళ్ళు అనేవి ఎక్కడా లేవు. నిజానికి, ఇంత కాలం ఆగి వుండకుండా, ఏడాది క్రితమే ఆ ఇళ్ళను లబ్దిదారులకు ఇచ్చేసి వుంటే వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధి బయటపడేది. అప్పుడు చేస్తే, చంద్రబాబు ముద్ర కనిపిస్తుంది కాబట్టి.. టైమ్‌ తీసుకుని, రంగులు మార్చి మరీ పేదలకు ఇచ్చేయాలన్నది వైసీపీ సర్కార్‌ ఆలోచన. ఏం లాభం.? ఇప్పుడు కూడా ఆ ‘పేరు’ మారలేదు.

టిడ్కో ఇళ్ళ విషయంలో ఇలా వుంటే, మరి.. పోలవరం ప్రాజెక్టు వ్యవహారం ఏమవుతుందో.? అంటూ వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోందట. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తెరపైకి వచ్చిన ‘ఆరోగ్యశ్రీ’ పేరుని, ‘ఎన్టీఆర్‌ వైద్య సేవ’ అని చంద్రబాబు పేరు మార్చినా, దాన్ని ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ అనే పేదలు పిలుచుకునేవారు. నిజానికి, ఆరోగ్య శ్రీ పథకానికి వైఎస్సార్‌ తన పేరు పెట్టుకోలేదు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టారు వైఎస్సార్‌. ఆ వైఎస్సార్‌ ఆలోచనలతో వైఎస్‌ జగన్‌ని అస్సలు పోల్చలేం. మంచి పనులు చేస్తే, జనం ఎవర్నయినా గుర్తుంచుకుంటారు. ఆ సోయ, దురదృష్టవశాత్తూ ప్రస్తుత రాజకీయాల్లో నాయకులకు కొరవడుతోంది.

Exit mobile version