ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

జస్ట్‌ ఆస్కింగ్‌: వీళ్ళకి కోటి.. వాళ్ళకు 25 లక్షలు మాత్రమే.!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతి చెందినవారికి కోటి రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించారు. ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నవారికీ ఎక్స్‌గ్రేషియా పెద్ద మొత్తంలోనే ప్రకటించారు. ఇది కాక, ‘ఎఫెక్టెడ్‌ ఏరియా’లో వున్న 15,000 మందికి ఒక్కొక్కరికీ 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. అభినందించాల్సిన విషయమే ఇది.

కానీ, గోదావరి నదిలో చోటు చేసుకున్న బోటు ప్రమాదానికి సంబంధించి మృతుల కుటుంబాలకు 25 లక్షలు మాత్రమే ఎక్స్‌గ్రేషియా ఇవ్వడమేంటి.? అన్న చర్చ తెరపైకొచ్చింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పలు పోస్టింగ్స్‌ దర్శనమిస్తున్నాయి.

విశాఖ గ్యాస్‌ లీక్‌ బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చి తీరాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మరి, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోన్న పర్యాటక బోటు ప్రమాదానికి గురై పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినప్పుడు కూడా ఇదే కోటి రూపాయలు పరిహారం ఇచ్చి తీరాలి కదా.!

గతంలో చంద్రబాబు హయాంలో బోటు ప్రమాదం జరిగితే 50 లక్షల పరిహారం డిమాండ్‌ చేసిన ఇదే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాక మాత్రం ఎక్స్‌గ్రేషియా విషయంలో ‘పీనాసితనం’ ఎందుకు ప్రదర్శించారన్నది నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్న.

మరోపక్క, విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ సంస్థతో అధికార పార్టీకి అత్యంత సన్నిహితంగా వుండే ఓ వ్యక్తికి సంబంధాలున్నాయంటూ కొన్ని వార్తా కథనాలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తుండడం గమనార్హం.

ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌, హుటాహుటిన విశాఖ వెళ్ళడం బాధితుల్ని పరామర్శించడం అభినందనీయమే అయినా, అప్పుడు గోదావరి దుర్ఘటనలో చూపించని ఉత్సాహం.. ఇప్పుడెందుకు ఆయన చూపారంటూ సోషల్‌ మీడియా వేదికగా దూసుకొస్తున్న ప్రశ్నలకు అధికార పార్టీ ఏం సమాధానమిస్తుందో ఏమో.!

Exit mobile version