ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

జగన్ సారూ.. వాలంటీర్లంటే అంత చులకనా.?

‘మీరు చేసేది స్వచ్ఛంద సేవ.. మీకు ప్రభుత్వం తరఫున ఇస్తున్నది గౌరవ భృతి.. అది జీతం కాదు. మీరు సేవ చేస్తున్నారు కాబట్టే, ఆ సేవ బాగా చేసినవారికి సన్మానాలు చేస్తున్నాం. మీరు జీతం తీసుకుంటే, మీకు జనంలో ఇంతటి గౌరవం దక్కేదా..’ అంటూ వాలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు.. బహిరంగ లేఖ ద్వారా.

ఇదెక్కడి విడ్డూరం.? ‘మేం లక్షల మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేశాం.. అందులో 90 శాతం ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకే దక్కాయి..’ అంటూ ప్రభుత్వం తరఫున పలువురు వైసీపీ పెద్దలు గతంలో సెలవిచ్చారాయె. ఇప్పుడేమో.. వాలంటీర్ అంటే ఉద్యోగి కాదని ముఖ్యమంత్రి చెబుతున్నారు. పైగా, సన్మానాలు చేస్తున్నాం కదా.. జీతాలు పెంచమని అడగకూడదని చెప్పడమేంటి.?

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముఖ్యమంత్రి కూడా ప్రజలకు చేసేది సేవ మాత్రమే. రాజకీయాల్లోకి వచ్చేదే ప్రజా సేవ చేయడం కోసం.. ప్రతిఫలం ఆశించకుండా సేవ చేస్తారు ప్రజా ప్రతినిథులు, రాజకీయ నాయకులు. వారికీ వేతనాలు అందుతున్నాయి కదా.. అదీ లక్షల్లో.

ప్రభుత్వ వ్యవస్థలో సలహాదారుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘అయినవారికి’ ఆ పదవులు కట్టబెట్టడం ద్వారా కోట్లాది రూపాయల ప్రజా ధనం వారి ‘సలహాలకోసం’ వెచ్చిస్తోంది ప్రభుత్వం. సంక్షేమ పథకాల పేరుతో ఎడా పెడా డబ్బులు వెదజల్లుతున్న ప్రభుత్వానికి, వాలంటీర్ల వ్యవస్థ భారంగా మారిపోతుందా.? ఆ వాలంటీర్లంటే అంత చులకన భావం ఏర్పడిందా.? సరే, వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనా.? కాదా.? అన్నది వేరే చర్చ.

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల్ని ఇంటింటికీ చేరవేసే బాధ్యతని వాలంటీర్లు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వాళ్ళు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. తమ చేతిలో నెలకి ఐదు వేలు మాత్రమే భృతి పడుతున్నా.. ప్రతి నెలా లక్షలాది రూపాయలను పెన్షన్లు, ఇతరత్రా సంక్షేమ పథకాల కోసం పంచుతున్నారు వాలంటీర్లు.

వేతనాలు పెంచండి, మమ్మల్ని గుర్తించండి.. అని వాలంటీర్లు ప్రభుత్వాన్ని వేడుకోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఊరిలో ఉపాధి దొరక్క, వాలంటీర్లుగా కాలం నెట్టుకొస్తున్నవారికి, ‘నచ్చితే చేయండి, నచ్చకపోతే మానెయ్యండి..’ అన్నట్టుగా ప్రభుత్వం తరఫున చీదరింపు ఎదురవడం దురదృష్టకరం.

కోట్లకు పడగలెత్తిన ప్రజా ప్రతినిథులు, సలహాదారులు.. తమ వేతనాల్ని వదులుకుని అయినా, వాలంటీర్ల పట్ల దయ చూపాలనే డిమాండ్ కూడా తెరపైకొస్తుండడం గమనార్హం. అయినా.. వాలంటీర్ల గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్న జగన్ సర్కార్, వాళ్ళనెందుకిలా రోడ్డున పడేసిందట.? ఇక్కడ విపక్షాల కుట్ర ఏముంది.? అన్నిటికీ నెపాన్ని విపక్షాల మీద నెట్టేయాలనే ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు వుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

Exit mobile version