అదే సమయంలో, కింది స్థాయిలో లోటు పాట్లపైనా విమర్శలొస్తాయి.. వాటి పట్ల ప్రభుత్వం మరింత చిత్తశుద్ధితో వ్యవహరించాలి. కొన్నాళ్ళ క్రితం.. కరోనా మొదటి వేవ్ సమయంలో, విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వహణలో వున్న కోవిడ్ కేర్ సెంటర్ అగ్ని ప్రమాదానికి గురై పలువురు ప్రాణాలు కోల్పోతే, ఆసుపత్రి నిర్వాహకుడైన ఓ ప్రముఖ వైద్యుడి మీద కేసులు మోపింది వైఎస్ జగన్ ప్రభుత్వం. కేసులు పెట్టాల్సిందే.. చర్యలు తీసుకోవాల్సిందే.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మరి, తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక పది మందికి పైగా ప్రాణాలు కోల్పోతే, అక్కడెందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేకపోయింది.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
అక్కడా పోయింది ప్రజల ప్రాణాలే.. ఇక్కడా పోయింది ప్రజల ప్రాణాలే. తేడా ఏంటంటే.. అక్కడ ప్రైవేటు ఆసుపత్రి.. ఇక్కడ ప్రభుత్వాసుపత్రి. అక్కడ అగ్ని ప్రమాదం.. ఇక్కడ ఆక్సిజన్ అందకపోవడం. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సమస్య వుంది గనుక, రుయా ఆసుపత్రిలో పది మంది ప్రాణాలు కోల్పోతే.. అది తీవ్రమైన నేరం కాదని అనగలమా.? సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్ ఎందుకు రుయా ఆసుపత్రికి చేరుకోలేదు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా కోవిడ్ బాధితుల ప్రాణాల్ని ఎందుకు పనంగా పెట్టారు.? అన్నదానిపై ప్రజలకు ప్రభుత్వం సమాధానమివ్వాల్సిందే కదా.?
విజయవాడ రమేష్ హాస్పిటల్ విషయంలో చర్యలు తీసుకున్నట్టే, తిరుపతి రుయా ఆసుపత్రి విషయంలోనూ జరిగిన దుర్ఘటనపై ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నది సర్వత్రా వినిపిస్తోన్న డిమాండ్.