ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రాజధాని తరలింపు తథ్యమా?

ఏపీ రాజధాని తరలింపు విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందా? కరోనాతో రాష్ట్రం కకావికలం అవుతున్నా, రాజధాని తరలింపులో హైకోర్టులో ఎదురుదెబ్బలు తగిలినా.. తాము అనుకున్నది చేయడానికే సర్కారు సన్నద్ధమవుతోందా? రాజకీయ వర్గాలు, జర్నలిస్టు సర్కిళ్లలో ప్రస్తుతం దీనికి ఔననే సమాధానం వినిపిస్తోంది. ఈ విషయంలో సోషల్ మీడియాలో కూడా జోరుగా ప్రచారం సాగుతోంది.

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం.. త్వరలో అక్కడ నుంచి పాలన ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి మొన్నటి ఉగాదినాడే అక్కడ నుంచి పాలనకు శ్రీకారం చుట్టాలని అధికార పార్టీ పెద్దలు యోచించినట్టు వార్తలొచ్చాయి. కానీ హైకోర్టు అభ్యంతరాలు, కరోనా పరిస్థితులతో అది నిలిచిపోయింది. అయినప్పటికీ రాజధాని విషయంలో అధికార పార్టీ పట్టుదలతోనే ఉంది. ఎలాగైనా విశాఖకు రాజధాని తరలించాలనే ధ్యేయంతో ఉంది. ఇందుకు సంబంధించి గుట్టుగా పనులు జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలతో కూడా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. మరోవైపు ఫర్నిచర్ తరలింపునకు కూడా రంగం సిద్ధమైనట్టు చెబుతున్నారు. ఈనెలఖరునాటికి విశాఖ నుంచి పాలన ప్రారంభం కావడమని తెలుస్తోంది.

తన మాట నెగ్గించుకోవడం కోసం ఎంతటి నిర్ణయం తీసుకోవడానికైనా సీఎం జగన్ వెనకాడరని, ఇప్పటివరకు జరిగిన పలు పరిణామాలే ఇందుకు నిదర్శనమనే చర్చ జోరుగా సాగుతోంది. ఉండవిల్లిలోని ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి శాసనమండలి రద్దు వరకు జరిగిన పరిణామాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇదే తరహాలో రాజధాని తరలింపు కూడా తథ్యమని పేర్కొంటున్నారు. అయితే, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఉద్యోగులను బదిలీ చేయకుండా ఆన్ డ్యూటీపై విశాఖ నుంచి పనిచేయించాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ విషయంపై అధికారులు ఎవరూ నోరు మెదపడంలేదు. అందరూ చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఏం మాట్లాడితే ఏం సమస్య వస్తుందో అని సైలెంటుగా ఉంటున్నారు. మొత్తానికి రాజధాని తరలింపు ప్రక్రియ జోరుగానే సాగుతోందని తెలుస్తోంది.

Exit mobile version