ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రెండేళ్ళ జగన్ పాలన: ఆ రెండు కేసుల సంగతేంటి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడానికి రెండు సంఘటనలు కీలక భూమిక పోషించాయంటారు రాజకీయ విశ్లేషకులు. వాటిల్లో ఒకటి కోడి కత్తి ఎపిసోడ్ కాగా, ఇంకొకటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య. ఈ రెండిటి విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సానుభూతి కురిసింది.

విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీద కోడి కత్తితో హత్యా ప్రయత్నం జరిగితే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, ఆ వ్యవహారాన్ని చాలా లైట్ తీసుకుంది. అదే చంద్రబాబు అండ్ టీమ్ చేసిన అతి పెద్ద తప్పు. ఓ ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించలేకపోవడం అన్నది ప్రభుత్వ వైఫల్యమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అప్పటి డీజీపీ, అప్పటి హోంమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి.. అంతా కలిసి ఆ ఘటనను జగన్ ఆడిన డ్రామాగా అభివర్ణించారు. దాంతో, ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది.

ఇక, వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయానికొస్తే, సరిగ్గా ఎన్నికల సమయంలో జరిగిందీ దారుణ ఘటన. చంద్రబాబే వైఎస్ వివేకానందరెడ్డిని చంపించారని వైసీపీ నేతలు, ప్రజల్ని నమ్మించగలిగారనే చర్చ అప్పట్లో గట్టిగా సాగింది. తొలుత గుండెపోటుగా వైసీపీ నేతలే చెప్పుకున్నారు.. చివరికి అది హత్యగా తేలింది. అయితే, అప్పటి పొలిటికల్ మూడ్ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం గురించే ఎక్కువ చర్చ జరిగింది.

కోడి కత్తి వ్యవహారంలో అయినా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో అయినా, ‘పొలిటికల్ సీక్రెట్’ అనేది మాత్రం ఇప్పటిదాకా బయటపడలేదు. రెండేళ్ళయింది వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయి. తన మీద హత్యాయత్నం జరగడంపై గుస్సా అయిన జగన్, అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు, చేయించారు. టీడీపీ కుట్ర.. అని వైసీపీ నినదించింది. వివేకా విషయంలోనూ ఇదే జరిగింది.

రెండేళ్ళు ముఖ్యమంత్రిగా వుండీ, జగన్ తనకు సంబంధించిన కీలకమైన రెండు కేసుల్లో తనకు తాను న్యాయం చేసుకోలేకపోవడాన్ని ఏమనుకోవాలి.? వివేకానందరెడ్డి స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాబాయ్. రెండేళ్ళ పాలనా వైఫల్యానికి ఈ రెండు కేసులూ నిదర్శనం. సీబీఐ చేతికి వివేకా హత్య కేసు వెళ్ళింది కాబట్టి.. అని వైసీపీ చేతులు దులుపుకోవడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

Exit mobile version