ఇక, తెలంగాణ మంత్రులు, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పలువురు కీలక నేతలు, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. దొంగ.. గజదొంగ.. అంటూ మండిపడుతున్నారు. వైఎస్ జగన్ మీద కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దానికి వైఎస్సార్సీపీ నుంచి సుతిమెత్తగా మాత్రమే స్పందన లభిస్తోంది. అయితే, తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న షర్మిల మాత్రం, ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోం..’ అంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. ‘కూతురు షర్మిల, తన తండ్రిపై విమర్శలు చేస్తున్నవారికి సరైన రీతిలో సమాధానం చెప్పగలుగుతున్నారు. మరి, పుత్రరత్నం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు, తన తండ్రిని తిడుతున్నవారిపై స్పందించడంలేదు.?’ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే, తాము అధికారంలో వున్నాం కాబట్టి, సంయమనం పాటించాల్సి వస్తోందన్నది వైఎస్సార్సీపీ ఉవాచ. మరి, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా అధికారంలోనే వుంది కదా.? వైఎస్ జగన్ – కేసీయార్ మధ్య ఈ మొత్తం వ్యవహారంపై అవగాహన లేకపోతే, అటు కేసీయార్ అండ్ టీమ్ అంతలా రెచ్చగొడుతున్నా, వైసీపీ అధినేత.. ఆంద్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకంత మౌనంగా వుంటారు.?
ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే మరి. ఏదిఏమైనా, ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్సార్ అభిమానుల నుంచి షర్మిల వైపుకే కాస్త సింపతీ వేవ్ వెళుతోంది. ‘అధికారం కోసం వైఎస్సార్ ఫొటో పెట్టుకున్నారు తప్ప, వైఎస్సార్ మీద విమర్శలు చేస్తున్నవారిపై వైఎస్ జగన్ నోరు మెదపలేకపోతున్నారు.. షర్మిల మాత్రం.. తన తండ్రి పట్ల ఎవరెలాంటి వ్యాఖ్యలు చేసినా ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు..’ అనే అభిప్రాయం వైఎస్సార్ అభిమానుల్లో బలపడుతోంది.. ఇటు తెలంగాణలో మాత్రమే కాదు, అటు ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కూడా.