వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, రాష్ట్రంలో రోడ్లు అత్యంత అధ్వాన్నంగా మారిపోయాయి. ‘మన పాలనలో వర్షాలు బాగా కురుస్తున్నాయ్.. అదీ దేవుడి దయతో. అయితే, వర్షాల కారణంగా ఓ చిన్న ఇబ్బంది వుంది.. అదే రోడ్లు పాడైపోవడం..’ అని పదే పదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు చెబుతుంటారు.
నిజమే, వర్షాలు కురుస్తున్నాయ్.. కానీ, గతంలో ఎన్నడూ లేనంతగా, సంవత్సరమంతా వర్షాలైతే కురిసేయడంలేదు కదా.? మరెందుకు రోడ్లు పాడైపోతున్నాయ్.? రోడ్లు పాడైపోవడం మామూలే.. గుంతలు పడతాయ్, వెంటనే పూడ్చి పెడితే.. రోడ్లు బాగవుతాయ్. లేదంటే, రోడ్ల మీద గుంతలు కాస్తా.. గుంతల్లో రోడ్లవుతాయ్.
వైఎస్ జగన్ హయాంలో.. గుంతల్లో రోడ్లుంటున్నాయ్.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఇదిగో రోడ్ల బాగు కోసం టెండర్లు పిలిచాం.. అదిగో పనులు చేసేస్తున్నాం.. అంటూ కథలు చెప్పీ చెప్పీ.. ప్రభుత్వ పెద్దలకైతే నీరసం రావడంలేదుగానీ, జనం ఆ గుంతల రోడ్లలో ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటూనే వున్నారు.
మొన్నామధ్యన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై నిరసన వ్యక్తం చేస్తూ.. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేపడితే.. ఆ ప్రాంతంలో రాత్రికి రాత్రి రోడ్లను బాగు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కథ మొదటికొచ్చేసింది.
వర్షాలు తగ్గితే డిసెంబరులో రోడ్లు బాగు చేసే పనులు ఊపందుకుంటాయట. తగ్గకపోతేనో.? అంతే సంగతి. అంటే, రోడ్ల పాపం పాలకుల నిర్లక్ష్యం కాదు.. ఆ పాపంతా వరుణుడిదేనని అనుకోవాలేమో.