ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అమరావతి రగడ: జగన్‌ సర్కార్‌కి మరో ఝలక్‌

తప్పు మీద తప్పు.. మళ్ళీ మళ్ళీ తప్పు.. ఎప్పటికప్పుడు కొత్త తప్పులు చేయడం, పాత తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేయడం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి అలవాటైపోయిందా.? కీలకమైన అంశాల్లో న్యాయస్థానం ప్రభుత్వానికి మొట్టికాయలేస్తోంటే.. లక్షల రూపాయల వేతనాలు చెల్లించి సలహాదారుల్ని ప్రభుత్వం ఎందుకు పెట్టుకుంటున్నట్లు.? వారి సలహాలు అభాసుపాలవుతోంటే, న్యాయస్థానాల్లో మొట్టికాయల్ని తప్పించుకునేందుకు మళ్ళీ కోట్లు వెచ్చించి ఖరీదైన లాయర్లను పెట్టుకోవడమెందుకు.? ఏమో, జగన్‌ సర్కార్‌కే తెలియాలి.

తాజాగా హైకోర్టులో ఇంకో ఝలక్‌ తగిలింది వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి. అదీ అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం 150వ రోజుకు చేరుకున్న తరుణంలో కావడం గమనార్హం. అమరావతి పరిధిలోని సుమారు 1300 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ళ పట్టాల కోసం కేటాయించేందుకు ప్రయత్నించింది జగన్‌ ప్రభుత్వం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పేదల కోసం ఈ భూమిని ఎంచుకోవడమేంటి.? అన్న ప్రశ్న రాజకీయ విశ్లేషకుల నుంచీ, విపక్షాలనుంచీ దూసుకొచ్చినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. రైతులు, రాజధాని కోసం భూములిచ్చారు. ఈ క్రమంలో సీఆర్‌డీఏతో ఒప్పందాలు జరిగాయి కూడా. అందుకేనేమో.. సీఆర్డీయేని రద్దు చేసేందుకూ జగన్‌ సర్కార్‌ ప్రకటించింది.

అయితే, శాసన మండలిలో తమ పప్పులుడక్కపోవడంతో, దాన్ని రద్దు చేయడానికీ ప్లాన్‌ చేశారు. ముందే చెప్పుకున్నాం కదా.. తప్పు మీద తప్పు. ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తోందన్నమాట జగన్‌ ప్రభుత్వం. ఇక, 1300 ఎకరాల భూములకు సంబంధించిన జీవోని న్యాయస్థానం నాలుగు వారాలపాటు సస్పెండ్‌ చేసింది. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ మార్చాలంటే, గ్రామ కమిటీలు, స్థానిక సంస్థల నుంచి అనుమతి తప్పనిసరి.. అంటూ రైతుల తరఫున న్యాయవాది తమ వాదనను విన్పించారు. మరోపక్క, ప్రభుత్వానికి సంబంధించిన విశేషాధికారాల్ని ప్రభుత్వం తరఫు న్యాయవాది విన్పించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ‘ఆర్‌5’ జోన్‌ని గుర్తిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 355ని నాలుగు వారాలపాటు సస్పెండ్‌ చేయడం జరిగింది.

సీఆర్డీయేలో పొందుపర్చిన సెక్షన్‌ 41 అత్యంత పకడ్బందీగా రూపొందిందనీ, దీన్ని అతిక్రమించడానికి వీల్లేదని రైతులు, రాజకీయ విశ్లేషకులు, విపక్ష నేతలు మొదటి నుంచీ చెబుతున్నా, ప్రభుత్వం అత్యుత్సాహం చూపడంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఏమన్నా అంటే, పేదలకు భూములిస్తామంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయ్‌.. అని బురద జల్లడం అధికార పార్టీకి అలవాటైపోయింది. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంలోనూ.. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా విషయాల్లో దాదాపు 50 సార్లకు పైగా న్యాయస్థానం నుంచి మొట్టికాయలు తప్పలేదు వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి గడచిన ఏడాది కాలంలో.

Exit mobile version