ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

జయము జయము చంద్రన్నా.! జగనన్నా.! ప్రజల పరిస్థితేంటన్నా.!

అదిగదిగో రాజధాని అమరావతి.. ఇదిగిదుగో పోలవరం. అక్కడ కనిపిస్తోందా కడప స్టీలు ప్లాంటు. ఇదిగో ప్రత్యేక హోదా.! ఎన్నెన్ని కబుర్లు చెప్పారు.? కబుర్లు, కహానీలతో టైమ్ పాస్ చేశారు. ఏదీ ఎక్కడ అమరావతి.? అంటే, చంద్రబాబు హయాంలో కట్టిన కొన్ని భవనాల సముదాయం కనిపిస్తోంది తప్ప, ప్రత్యేక హోదా లేదు, రైల్వే జోనూ లేదు, కడప స్టీలు ప్లాంటు ఊసే లేదు.! పోలవరం ప్రాజెక్టు సంగతంటారా.? అదో మిధ్య.!

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ‘జయము జయము చంద్రన్నా..!’ అంటూ ఎద్దేవా చేశారు. ముందు ముందు ఎవరు అధికారంలోకి వస్తారోగానీ, ఒకవేళ వైఎస్ జగన్ కాకుండా చంద్రబాబు అధికారంలోకి వస్తే, ‘జయము జయము జగనన్నా..’ అంటూ వెటకారం చేస్తారు. అంతేనా, అంతకు మించి ఇంకేమన్నా వుంటుందా.?

ప్రజల సొమ్ముని పబ్లిసిటీ కోసం చంద్రబాబు వృధా చేశారన్నది అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చిన మాట. నిజమే, ఈ విషయంలో చంద్రబాబు చేసింది నూటికి నూరు పాళ్ళూ తప్పే. మరి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరుగుతున్నదేమిటి.?

తమ హయాంలో అసలు ఫుల్ పేజీ ప్రకటనలే వుండంటూ వైసీపీ నేతలు, అందునా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో చెప్పుకొచ్చారు. మరి, వాస్తవ పరిస్థితేంటి.? ఎడా పెడా పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలతో నింపేస్తున్నారు. కుప్పలు తెప్పలుగా సలహాదారులు. ఇవి చాలదన్నట్టు అడ్డగోలు నిర్ణయాలు, వాటి నిమిత్తం.. న్యాయవాదులకు పెద్ద మొత్తంలో చెల్లింపులు. దీన్ని కదా అసలు సిసలు వృధా అనేది.?

అమరావతి పేరుతో వైఎస్ జగన్ హయాంలో నడిచిన కథ అంతా ఇంతా కాదు. మూడు రాజధానులన్నారు.. రాష్ట్రాన్ని నిండా ముంచేశారు. ఇంకా ఏ మొహం పెట్టుకుని వైసీపీ నేతలు వెటకారాలు చేస్తారంటూ జనం ఛీత్కరించుకునే పరిస్థితొచ్చింది. అయినాగానీ, తగ్గేదే లే.! అంటూ ‘జయము జయము..’ అంటూ వెటకారాలు కొనసాగిస్తూనే వుంది అధికార పక్షం. అవును మరి, చంద్రబాబు అయినా.. వైఎస్ జగన్ అయినా.. ముఖ్యమంత్రి హోదాలో చేసే పబ్లిసిటీ స్టంట్ల వల్ల నష్టపోయేది జనమే కదా.! వాళ్ళకేంటి నొప్పి.?

Exit mobile version